నటి మీరామిథున్ '8 తూట్టాగళ్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. దక్షిణ భారతీయ అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకొని.. ఇటీవల సొంతంగా అందాల పోటీలను నిర్వహించడానికి ప్లాన్ చేసి వివాదాలలో చిక్కుకుంది.

తాజాగా ఈమెపై చీటింగ్ కేసు నమోదలైంది. స్థానిక టీ.నగర్, ప్రకాశం వీధికి చెందిన రజిత్ భద్రాశ్రీ అనే వ్యక్తి నటి మీరామిథున్ పై పాండిబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఆ కంప్లైంట్ లో తను పూలదండల వ్యాపారం చేసుకుంటున్నానని.. తనకు 2018లో నటి మీరామిథున్ పరిచయమైందని తాను మిస్ దక్షిణాది అందాల పోటీలో కిరీటాన్ని గెలుచుకున్నానని, త్వరలో సొంతంగా అందాల పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పి.. దానికి డిజైనింగ్ కాంట్రాక్టు తనకు ఇప్పిస్తానని చెప్పి అడ్వాన్స్ గా రూ.50 వేలు తీసుకుందని చెప్పాడు. అయితే ఆమె డిజైనింగ్ కాంట్రాక్టు తనకు ఇవ్వలేదని, తన నుండి తీసుకున్న యాభై వేలు తిరిగి చెల్లించకుండా మోసం చేసిందని పేర్కొన్నారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నటి మీరామిథున్ ని విచారించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆమె తమిళ బిగ్ బాస్ గేమ్ షో లో ఉండడంతో ఆమెని విచారించడానికి హౌస్ లోకి ప్రవేశించే విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.