ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తోన్న చిత్రం 'సాహో'. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాల వ్యవహారాలు వేరుగా ఉంటాయి. బాహుబలి సినిమా సమయంలో కత్తులు, ఈటెలు కోసం ఆయుధాల ఫ్యాక్టరీ పెట్టేశారు. 

ఇప్పుడు 'సాహో' కోసం ఏకంగా వందల సంఖ్యలో కార్లు తీసుకొచ్చారు. ఈ సినిమా మొత్తం ఛేజింగ్ లు, యాక్షన్ సీన్లు ఇలా అల్ట్రా మోడరన్ జేమ్స్ బాండ్ తరహాలో సినిమా ఉంటుంది. దీంతో సినిమా కోసం విపరీతంగా వాడాల్సి వచ్చిందట.

ముఖ్యంగా దుబాయ్ లో తీసిన ఛేజింగ్ సీన్ చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. 'సాహో' సినిమా కోసం చాలా కార్లు కొనాల్సి వచ్చిందట. సినిమా మొత్తంలో 120 కార్లు వాడినట్లు సమాచారం. ఒక్క దుబాయ్ ఛేజింగ్ ఎపిసోడ్ లోనే 56 కార్లు వాడారట. ఈ సీన్ కోసం ఓ ప్రత్యేకమైన ట్రక్ ను స్వయంగా తయారు చేయించారు.

మరో యాక్షన్ సీన్ లో 18 కార్లు వాడారట. అలానే సినిమాలో మరికొన్ని సీన్లు కలిపి 46 కార్లు వాడారని తెలుస్తోంది. 'సాహో' సినిమాకు ముంబై, హాలీవుడ్ నిపుణులు పని చేశారు. వారి రెమ్యునరేషన్స్ కోట్లలో ఉంటాయి. శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.