వెయ్యి మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన క్యాన్సర్‌ టెస్ట్ ల  మొదటి శిబిరం నేడు( జూలై 9న) హైదరాబాద్ లో దిగ్విజయం అయింది.

మెగాస్టార్‌ చిరంజీవి సినిమా పరిశ్రమకి తనవంతు సేవా కార్యక్రమాలు అందించడంలో ఎప్పుడూ ముందే ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా స్టార్‌ హాస్పిటల్స్ తో కలిసి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినిమా కార్మికులకు, సినీ జర్నలిస్ట్ లకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్‌ టెస్ట్ లు నిర్వహించారు. ఆదివారం చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ప్రాంగణంలో ఈ టెస్ట్ లు నిర్వహించారు. ఇందులో భారీగా సినీ కార్మికులు, నటులు, మీడియా ప్రతినిథులు పాల్గొని టెస్ట్ లు చేయించుకున్నారు. 

వెయ్యి మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన క్యాన్సర్‌ టెస్ట్ ల మొదటి శిబిరం నేడు( జూలై 9న) హైదరాబాద్ లో దిగ్విజయం అయింది. తదుపరి జూలై 16న విశాఖపట్నం, జూలై 23న కరీంనగర్ లో ఈ శిబిరాల్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఖర్చు లేకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, వి. ఎన్. ఆదిత్య, దొరై తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ, స్టార్ హాస్పిటల్ డాక్టర్ గోపీచంద్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని, శ్రేయోభిలాషని దాదాపు 25 ఏళ్ల నుంచి ఆయనతో మాకు పరిచయం ఉందన్నారు. గోపీచంద్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మా అన్నయ్య ఆధ్వర్యంలో నడుస్తున్న బ్లడ్ బ్యాంకులో చేయడం మాకు గర్వకారణమని నాగబాబు అన్నారు. ఇక ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం దాదాపు 2000 మంది రిజిస్టర్ చేసుకున్నారని రిజిస్టర్ చేసుకోని వారు కూడా చాలా మంది వస్తున్నారని ఈ సందర్భంగా నాగబాబు అన్నారు. ఇలా ముందు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుంటే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తే అవకాశం లేకుండా ఉంటుందని ఆయన అన్నారు. గోపీచంద్ కి, క్యాన్సర్ స్పెషలిస్ట్ టీం కి హ్యాట్సాఫ్ చెప్పారు నాగబాబు. 

ఇప్పటివరకు రక్తదానం నేత్రదానం మీద అవగాహన పెంచామని ఇప్పుడు ఇలా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ ముందే క్యాన్సర్ను అరికట్టే అవకాశాన్ని తమకు కల్పించినందుకు గోపీచంద్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈరోజు హైదరాబాదులో జరిగిన తర్వాత కరీంనగర్ తో మొదలుపెట్టి సుమారు 20 ప్రాంతాలలో ఇదే విధమైన పరీక్షలు చేయబోతున్నారని అలా పరీక్షలు చేసిన అన్ని పరీక్షలు నెగిటివ్ రావాలని తాను కోరుకుంటున్నాను అని అన్నారు. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగితే చికిత్సలో కూడా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాయితీ అందేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. ఇక స్టార్ హాస్పిటల్ క్యాన్సర్ వైద్యుల స్పెషలిస్ట్ టీం మీ ఊర్లకే వస్తున్నారు, మీకు ఏమాత్రం అనుమానం ఉన్న సరదాగా వచ్చి టెస్ట్ చేయించుకోండి అని నాగబాబు పిలుపునిచ్చారు.

స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్ మాట్లాడుతూ, రెండు వారాల క్రితం మెగాస్టార్ చిరంజీవితో ఈ క్యాంపు గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు.. అభిమానులు మాత్రమే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ వారు మాత్రమే కాదు ఫిలిం జర్నలిస్టులు మాత్రమే కాకుండా సాధారణ పౌరులు కూడా ఈ క్యాన్సర్ మీద అవగాహన పెంచుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ అనే కాదు ఎలాంటి జబ్బు అయినా ముందే కనుక్కుంటే దాన్ని త్వరగా తగ్గించే అవకాశం ఉంటుందని జబ్బు వచ్చాక మందులు వాడటం కంటే జబ్బు వచ్చే సూచనలు కనిపించినప్పుడు దాన్ని నివారించడం మంచిదని గోపీచంద్ అభిప్రాయపడ్డారు. లక్షణాలు కనిపించిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే కొన్ని ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడతాయి ఎందుకంటే ఒక్కోసారి స్టేజ్ దాటిన తర్వాత లక్షణాలు కనిపిస్తాయని ఆయన అన్నారు. 

ఇక ఈ కార్యక్రమాలను డిజైన్ చేసింది ముందుగానే క్యాన్సర్ లక్షణాలు ఏవైనా కనిపించినా అనుమానం ఉన్నా ట్రేస్ చేసి దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్లడం కోసం అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20 ప్రాంతాలలో ఇలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని దానికి మెగాస్టార్ చిరంజీవి అండగా ఉంటామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు, నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం అంటే చాలా శ్రద్ధ వహిస్తానని తనకు తెలిసిన వారైనా తెలియని వారైనా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన దృష్టికి వస్తే వెంటనే అండగా నిలబడి అనారోగ్యం క్లియర్ అయ్యే ప్రయత్నాలు చేస్తారని అన్నారు. తాను మాట్లాడుతుంటే ఒక సినీ జర్నలిస్ట్ కి కూడా ఆయన వైద్య సహాయం అందించారనే విషయం తెలిసిందని ఇప్పుడు కూడా తమ ద్వారా అనేక మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడంలో ఆయన కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు. మీడియా కూడా ఈ విషయానికి విస్తృత ప్రాచుర్యం కల్పించి ప్రజల్లో దీనిమీద అవగాహన తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.