Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: C/o కంచరపాలెం

ఈ మధ్యకాలంలో విడుదలకు ముందు ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో హైప్ రాలేదనే చెప్పాలి. కానీ C/o కంచరపాలెం సినిమా పేరు విడుదలకు ముందే తన సత్తా చాటుతోంది. శేఖర్ కమ్ముల, రాజమౌళి, సుకుమార్ ఇలా దర్శకులందరూ ఇదొక గొప్ప సినిమా, మిస్ కావొద్దని ప్రత్యేకంగా చెబుతున్నారు. మరి అంతగా ఈ సినిమాలో ఏముందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం

c/o kancharapalem telugu movie review
Author
Hyderabad, First Published Sep 5, 2018, 12:02 AM IST

నటీనటులు: సుబ్బారావ్, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ తదితరులు 
సంగీతం: స‌్వీక‌ర్ అగ‌స్తి
సినిమాటోగ్రఫర్: ఆదిత్య జ‌వ్వాడి అండ్ వ‌రుణ్ ఛాపేక‌ర్
ఎడిటర్: రవితేజ గిరిజిల
నిర్మాత: విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి
సమర్పణ: రానా దగ్గుబాటి 
దర్శకత్వం: వెంకటేష్ మహా 

ఈ మధ్యకాలంలో విడుదలకు ముందు ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో హైప్ రాలేదనే చెప్పాలి. కానీ C/o కంచరపాలెం సినిమా పేరు విడుదలకు ముందే తన సత్తా చాటుతోంది. శేఖర్ కమ్ముల, రాజమౌళి, సుకుమార్ ఇలా దర్శకులందరూ ఇదొక గొప్ప సినిమా, మిస్ కావొద్దని ప్రత్యేకంగా చెబుతున్నారు. మరి అంతగా ఈ సినిమాలో ఏముందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ
రాజు(సుబ్బారావు) గవర్నమెంట్ ఆఫీస్ లో అటెండర్. యాభై ఏళ్లు దగ్గర పడుతున్నా అతడికి ఇంకా పెళ్లి కాకపోవడంతో ఊర్లో అందరూ ఆయన గురించే మాట్లాడుతుంటారు. అదే సమయంలో తన ఆఫీస్ కి బదిలీ అయి వచ్చిన రాధ(రాధ బెస్సీ) అనే మహిళతో ప్రేమలో పడతాడు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న రాధ కూడా రాజుని పెళ్లి  చేసుకోవాలనుకుంటుంది. గడ్డం(మోహన్ భగత్) వైన్ షాప్ లో పనిచేస్తుంటాడు. తన షాప్ కి రోజూ మందు కొనడానికి వచ్చే వేశ్య సలీమా(విజయ ప్రవీణ) కళ్లను చూసి ప్రేమిస్తాడు. జోసెఫ్(కార్తీక్ రత్నం) టీనేజ్ కుర్రాడు.

జిమ్ లో పనిచేస్తూ సెటిల్మెంట్స్ చేస్తుంటాడు. ఓ గొడవ కారణంగా భువనేశ్వరి(ప్రణీతా పట్నాయక్) అనే బ్రాహ్మణుల అమ్మాయిని ప్రేమిస్తాడు. సుందరం(కేశవ) స్కూల్ కి వెళ్లే పిల్లాడు. తనతో పాటు చదువుకునే సునీత(నిత్య శ్రీ) అనే సుందరంకి చాలా ఇష్టం. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలా కంచరపాలెం అనే ప్రాంతంలో మొదలైన నాలుగు ప్రేమకథల స్టోరీనే ఈ సినిమా. ఈ ప్రేమికులందరూ తమ ప్రేమను గెలిపించుకున్నారా..? మతం, కులం కారణంగా తమ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు..? అసలు వీరందరికీ ఉన్న లింక్ ఏంటి..? నాలుగు ప్రేమకథలు ఒకే కథగా ఎలా కలుస్తాయి..? అనే  విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
కంచరపాలెం అనే ప్రాంతంలో కొందరి జీవితాలను కథగా తీసుకొని దర్శకుడు వెంకటేష్ మహా తెరపై ఆవిష్కరించాడు. మనం రోజూ వీధుల్లో చూసే జీవితాలను సినిమాటిక్ జోలికి  పోకుండా సహజంగా చూపించారు. దీంతో ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంతసేపు కూడా ఆ పాత్రలను దగ్గరుండి మరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నాలుగు కథలను ప్యారలల్ గా నడిపిస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా.. ఆ పాత్రల ద్వారానే కావల్సినంత కామెడీ, ఎమోషన్స్ పండించడంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. దర్శకుడు సినిమాను మొదలుపెట్టి చాలా సేపు అవుతున్నా.. కథలోకి వెళ్లకపోవడం కాస్త విసుగొచ్చినా.. ఎప్పుడైతే మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవుతాడో.. ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. నాలుగు సున్నితమైన ప్రేమ కథలు, వారి మధ్య భావోద్వేగ సన్నివేశాలతో సినిమాను నడిపించిన తీరు సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుంది.

c/o kancharapalem telugu movie review

సినిమా స్లో అవుతుందనిపించే ప్రతిసారీ ఏదొక కామెడీ, ఎమోషన్ సీన్ వచ్చి ఆ ఫీలింగ్ ని పోగొట్టేవి. కథపై ఆసక్తిని మరింత పెంచేవి. ప్రతి పాత్రకు ప్రాముఖ్యతనిస్తూ.. కథను నడిపించిన తీరుని మెచ్చుకోవాల్సిందే. ఇప్పటికీ కూడా కులం, మతం అంటూ సమాజంలో కొందరు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారనే వాస్తవ విషయాలను తెరపై చూపించిన తీరు మెప్పిస్తుంది. సినిమా చూసే ప్రేక్షకుడిపై ఈ సన్నివేశాలు బలమైన ముద్ర వేస్తాయి. యాభై ఏళ్ల వ్యక్తి ప్రేమ కథ సరదాగా సాగుతుంటే.. చిన్న పిల్లల కథ మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది. గడ్డం-సలీమాల ప్రేమకథ విషాదంతో, భావోద్వేగాలతో రాసుకోవడంతో హృదయాన్ని కదిలిస్తాయి. జోసెఫ్, బ్రాహ్మణ అమ్మాయి ప్రేమకథను సింపుల్ గా ముగించడం పెద్దగా ఆకట్టుకోకపోయినా.. కథలో అంతకుమించి ఆశించలేమ్.

సినిమా మొదటి ఇరవై నిమిషాలు పాత్రల పరిచయ సన్నివేశాలతో సమయం వృధా చేసిన దర్శకుడు ఇంటర్వల్ సమయానికి అప్పుడే ఇంటర్వల్ వచ్చేసిందా..? అనిపించేలా చేశాడు. ఇక సెకండ్ హాఫ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో కలిగేలా చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా పూర్తయిన తరువాత కూడా ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈ సినిమాతో యాభైకి పైగా కొత్త నటీనటులు వెండితెరకు పరిచయమయ్యారు. ప్రతి ఒక్కరూ సహజ నటనతో మెప్పించారు. వారు నటించారని అనడం కంటే జీవించేశారనే చెప్పాలి.

c/o kancharapalem telugu movie review

ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్లు, డ్యూయట్స్ కనిపించవు. చక్కటి నేపధ్య సంగీతంతో సినిమాను నడిపించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మనసుపెట్టి ఈ సినిమా కోసం పని చేశారనిపిస్తుంది. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా ఇలాంటి ఓ సినిమాను ప్రేక్షకులకు అందించిన చిత్రబృందాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. అయితే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందనైతే చెప్పలేం. కమర్షియల్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకుడికి, సినిమా అంటే నాలుగు పాటలు, ఫైట్లు, డాన్స్ లు అనే మూస ధోరణికి గుడ్ బై చెబుతూ కొత్త కథలను ఆస్వాదించే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కమర్షియల్ గా ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. అవార్డులు కొల్లగొట్టడం మాత్రం ఖాయమనిపిస్తుంది. 

రేటింగ్: 3/5 

Follow Us:
Download App:
  • android
  • ios