2.0 తరువాత రజినీకాంత్ నుంచి వస్తోన్న చిత్రం పేట్ట. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఆడియెన్స్ ని టీజర్ అండ్ సాంగ్స్ తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే తెలుగులో కూడా సినిమాకు క్రేజ్ పెరగడంతో హక్కుల విషయంలో పలువురు నిర్మాతలు సినిమాను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. 

ఫైనల్ గా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సినిమా హక్కులను దక్కించుకున్నారు. ఈ ఏడాది మొదట్లో జై సింహం సినిమాను నిర్మించి కొద్దిపాటి లాభాలను అందుకున్న కళ్యాణ్ ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ - వినాయక్ కాంబినేషన్ లో ఇంటిలిజెంట్ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా భారి నష్టాలను మిగిల్చడంతో ఆయన మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. 

ఇక ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాతో సి.కళ్యాణ్ రికవర్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పేట్ట సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకొని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా సి.కళ్యాణ్ కోలుకోవడం కష్టమే అని కూడా పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.  సినిమా ఎలాగైనా హిట్టవ్వాలని తెలుగులో భారీగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. 

త్వరలోనే అందుకు సంబందించిన పనులు స్టార్ట్ చేయనున్నారు. రజినీకాంత్ సరసన సినిమాలో త్రిష నటించగా ముఖ్యపాత్రలో సిమ్రాన్ నటించారు. సంక్రాంతి బరిలో భారీ బడ్జెట్ సినిమాల నడుమ రజినీకాంత్ సినిమా పోటీపడనుంది. మరి సి.కళ్యాణ్ కు సినిమా ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి.