అల్లు అర్జున్, సుకుమార్ ల మధ్య గొడవ జరిగిందని, `పుష్ప 2` సినిమా షూటింగ్ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బన్నీవాసు వివరణ ఇచ్చాడు.
`పుష్ప2` సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో రెండో పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమా చాలా కాలంగా డిలే అవుతూ వస్తుంది. ఇప్పటికే మూడు నాలుగు సార్లు వాయిదా పడింది. గతేడాది రావాల్సిన మూవీ ఈ సమ్మర్‌కి, ఆ తర్వాత ఆగస్ట్ 15కి, ఇప్పుడు డిసెంబర్ 6కి మారిపోయింది. సుకుమార్ షూటింగ్ కోసం ఎక్కువ టైమ్ తీసుకోవడం వల్ల సినిమా డిలే అవుతుందనే ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా `పుష్ప2`కి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవ జరిగిందని, ఇద్దరు పెద్దగా గొడవ పడి వెళ్లిపోయారని. సుకుమార్ అమెరికా వెళితే, బన్నీ దుబాయ్ వెళ్తున్నాడని అన్నారు. అంతేకాదు ఇన్నాళ్ల తర్వాత బన్నీ గెడ్డం ట్రిమ్ చేశారు. దీంతో ఇక `పుష్ప 2` ఆగిపోయినట్టే అని, ఈ ఏడాది కూడా రావడం కష్టమని అంటున్నారు. ఈ రూమర్స్ పెద్ద రచ్చ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా బన్నీవాసు స్పందించారు. అసలు విషయం బయటపెట్టారు. బన్నీ ఎందుకు గెడ్డం తీసుకున్నాడు, సుకుమార్, బన్నీ మధ్య జరిగిన గొడవేంటనేది చెప్పారు. అల్లు అర్జున్‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా వరకు పూర్తయ్యింది. మరో 12 రోజులు షూటింగ్‌లో పాల్గొంటే అయిపోతుంది. అయితే సుకుమార్ ఈ లోపు సినిమాని ఎడిటింగ్ చేయాలని భావించారు. సినిమా ఎడిటింగ్ చేస్తే ఎంత వస్తుంది? ఇంకా రీ షూట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అనేది క్లారిటీ వస్తుందని, ఎడిటింగ్ ఓ నెల రోజులు పట్టేలా ఉంది. దీంతో షూటింగ్ ఆపేశారు. ఎడిటింగ్ మీద కూర్చున్నారు. ఇంకా ముప్పై నలభై రోజులు ఉంది కాబట్టి, ఈ లోపు ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ వెళ్లి వద్దమని బన్నీ వెళ్లిపోయాడట. షూటింగ్‌కి గ్యాప్ చాలా ఉండటంతో ఆ లోపు గెడ్డం పెరుగుతుందని భావించి ట్రిమ్ చేసుకుని వెళ్లాడని తెలిపారు బన్నీ వాసు. ఎడిటింగ్ అయిపోయాక ఎన్ని రోజులు షూట్ చేయాల్సిన అవసరం ఉంటుందో, అదంతా ఒకేసారి చేయోచ్చు అని ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారని తెలిపారు బన్నీవాసు.
వాళ్లిద్దరి మధ్య జరిగింది ఇదే, అంతకు మించి గొడవేం లేదని, తమ మధ్య ఉన్నది చాలా ఎమోషనల్ బాండింగ్ అని, అది అంత ఈజీగా బ్రేక్ అయ్యేది కాదన్నాడు బన్నీవాసు. అదే సమయంలో వచ్చే నెల ఆగస్ట్ మొదటివారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని, దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇందులో మలయాళ నటుడు ఫహద్ పాజిల్ షూటింగ్ పార్ట్ ఎక్కువగా ఉందని చెప్పారు. అంతేకాదు `పుష్ప 2` అనేది బ్రాండ్ అని, దాన్ని సుకుమార్, బన్నీ ఎంతో నమ్ముతున్నారు. దానికోసం ఎంతైనా పనిచేస్తారు. సుకుమార్ మరో ఆరు నెలలు షూటింగ్ చేయాలన్నా అల్లు అర్జున్ పాల్గొంటాడు. అందులో సమస్యనే లేదు. బయట వచ్చే వార్తలన్నీ పుకార్లే అని, కానీ సినిమా ప్రమోషన్స్ కి బాగా పని చేస్తున్నాయన్నారు బన్నీవాసు. గీతా ఆర్ట్స్ లో నిర్మిస్తున్న `ఆయ్` సినిమా టీజర్ ఈవెంట్లో బన్నీ వాసు ఈ విషయాలను వెల్లడించారు. ఇందులో నితిన్ నార్నే హీరోగా నటిస్తుండటం విశేషం.
