చిన్న సినిమాగా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న చిత్రం 'బ్రోచేవారెవరురా'. ఇలాంటి సినిమాలకు డిజిటల్ రైట్స్ ఇట్టే అమ్ముడిపోతాయి. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇంకా శాటిలైట్ డీల్ పూర్తికాలేదని తెలుస్తోంది. దానికి కారణం నిర్మాతలు రేట్లు ఎక్కువగా చెప్తున్నారని సమాచారం.

ఈ సినిమా రిలీజ్ కి ముందు శాటిలైట్ రైట్స్ పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. హీరో శ్రీవిష్ణుకి పెద్దగా క్రేజ్ లేకపోవడంతోసినిమాపై ఎవరూ దృష్టి పెట్టలేదు. కానీ సినిమా హిట్ అయిన వెంటనే కొన్ని ఛానెల్స్ రైట్స్ దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. 

దీంతో నిర్మాతలకు ఆశ ఎక్కువైంది. ఓ ఛానెల్ తో డీల్ దాదాపు పూర్తయిందనుకున్న సమయంలో మరో యాభై లక్షలు ఎక్కువ వస్తున్నాయనే కారణంతో మూడో పార్టీకి శాటిలైట్ అమ్మేశారు. అయితే అక్కడ కూడా లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారట.

ప్రస్తుతం ఏ ఛానెల్ కూడా రైట్స్ గురించి  పట్టించుకోవడం లేదని.. ఇప్పుడేమో ఆ మూడో పార్టీ వాళ్లు కూడా హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మరి ఇప్పటికైనా  నిర్మాతలు అత్యాశని వదిలి ఛానెల్స్ చెప్పిన అమౌంట్ కి డీల్ సెట్ చేసుకుంటారేమో చూడాలి!