`బ్రో` సినిమా సందడి షురూ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన వరుస అప్‌డేట్లు పవన్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి. తాజాగా `బ్రో` టీజర్ టైమ్‌ని ప్రకటించింది యూనిట్.
ప్రస్తుతం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మానియా సాగుతుంది. ఆయన స్పీడ్ మామూలుగా లేదు. వరుస బెట్టి సినిమాలు చేస్తూ, వారానికో సినిమా అప్‌డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. ఓ వైపు జనసేన పార్టీ రోడ్ షోలో డైరెక్ట్‌గా ఫ్యాన్స్ అలరిస్తూ, మరోవైపు సినిమా అప్‌డేట్లతోనూ వారిని ఖుషి చేస్తున్నారు. తాజాగా `బ్రో` సినిమా వంతు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతుంది.
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పాత్ర ఇంట్రడక్షన్ ఇచ్చారు, అలాగే సాయిధరమ్ తేజ్ పాత్ర ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్నారు. `బ్రో` సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. గత రెండు రోజులుగా `బ్రో` టీజర్ అప్‌డేట్ అంటూ టీమ్ హడావుడి చేస్తూనే ఉంది. తాజాగా ఎట్టకేలకు టీజర్ విడుదల టైమ్‌ని ప్రకటించింది. రేపు గురువారం(జూన్ 29) సాయంత్రం `బ్రో` టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. సాయంత్రం ఐదు గంటల నాలుగు(5.04) నిమిషాలకు టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు టీమ్ వెల్లడించింది.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో పవన్ చిటికె వేస్తున్నట్టుగా ఉంది. `బ్రో`టీజర్‌కి టైమ్ స్టార్ట్ అంటూ చిటికే వేసినట్టుగా ఈ లుక్ ఉండటం విశేషం. అంతేకాదు టీజర్ కూడా అందరి చేత చిటికె వేయించేలా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్.
తెలుగుకి తగ్గట్టుగా దర్శకుడు సముద్రఖని మార్పులు చేశారట, అంతేకాదు పవన్ స్టయిల్‌కి, ఇమేజ్‌కి తగ్గట ఫ్యాన్స్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్లని కూడా జోడించారట. దీంతో చాలా వరకు ఈ సినిమా కొత్తగా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన పవన్ ఫస్ట్ లుక్ వాహ్ అనిపించింది. ఫ్యాన్స్ చేత ఈలలు వేయించింది. ఇందులో పవన్ లుక్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు టీజర్ ఎలాంటి రచ్చే చేయబోతుందో చూడాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్.. వారాహిరథ యాత్రలో ఉన్నారు. ఏపీలో వరుస సభలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ టీజర్ కి డబ్బింగ్ అక్కడి నుంచే చెప్పారు. `బ్రో` టీమ్ మొబైల్ యూనిట్ తరహాలో అక్కడి(మంగళగిరి)కి చేరుకుని అక్కడే పవన్ చేత డబ్బింగ్ చెప్పించారు. ఆయాఫోటోలను టీమ్ మార్నింగ్ విడుదల చేసింది. సాయంత్రానికి టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్‌ని ఫిక్స్ చేశారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు షురూ చేశారు. ఇక రేపు ఎంతటి రచ్చ ఉంటుందో చూడాలి. ఇక `బ్రో` చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం జులై 28న విడుదల కాబోతుంది. ఇంకా కరెక్ట్ గా నెల రోజులుంది. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూ చేస్తున్నారు.
