మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తరువాత ఇచ్చిన రీఎంట్రీలో 'ఖైదీ నెం150' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత అతడు ఓకే చేసిన చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు నిర్మాత రామ్ చరణ్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర్ శివార్లలో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన కీలక యుద్ధ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్ లో పాల్గొనాలి. యుద్ధ సన్నివేశాలకు తగ్గట్లుగా గ్రౌండ్ ను సిద్ధం చేసింది చిత్రబృందం. కానీ గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా గ్రౌండ్ పాడవడంతోషూటింగ్ ను అర్ధాంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి కలిగింది.

రాత్రిపూట కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉండటం.. వాతావరణం సహకరించకపోవడంతో షూటింగ్ కు ఆటంకం కలుగుతోంది. దీంతో మరో రెండు రోజుల పాటు షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార కనిపించనుంది. అలానే అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.