Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: బ్రాండ్ బాబు

దర్శకుడు  మారుతి సినిమాలు సరికొత్తగా వైవిధ్యంతో కూడి ఉంటాయి. ఆయన డైరెక్ట్ చేయలేని కొన్ని కథలను తన దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ల సహాయంతో రూపొందించిన సందర్భాలు ఉన్నాయి.

brand babu movie telugu review

నటీనటులు: సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర
మ్యూజిక్: జేబి
కెమెరామెన్: కార్తీక్ ఫలణి
ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి
నిర్మాత: ఎస్. శైలేంద్ర
డైరెక్టర్: ప్రభాకర్.పి

దర్శకుడు  మారుతి సినిమాలు సరికొత్తగా వైవిధ్యంతో కూడి ఉంటాయి. ఆయన డైరెక్ట్ చేయలేని కొన్ని కథలను తన దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ల సహాయంతో రూపొందించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మారుతి అందించిన కథతో దర్శకుడు ప్రభాకర్ ఓ సినిమాను రూపొందించారు. అదే 'బ్రాండ్ బాబు'. సినిమా ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ముందే తెలుసుకుందాం!

కథ: 
రత్నంబాబు(మురళీశర్మ) సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడు వాడే కర్చీఫ్ నుండి కాలికి వేసే షూ వరకు అన్ని బ్రాండే ఉండాలి. తన ఇంట్లో వాళ్లు కూడా అలా ఉండాల్సిందే. ఆఖరికి ఇంట్లో పని చేసే వాళ్లకి కూడా బ్రాండ్ బట్టలే వేసుకోవాలని అంటాడు. తన కొడుకు డైమండ్ బాబు(సుమంత్ శైలేంద్ర)ని కూడా అలానే పెంచుతాడు. ఇలా బ్రాండ్ బ్రాండ్ అనే ఫ్యామిలీ తమ ఇంటికి వచ్చే కోడలు కూడా పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి అయి ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో డైమండ్ బాబు హోం మినిష్టర్ అమ్మాయి అనుకొని వాళ్ల ఇంట్లో పనిమనిషి రాధ(ఈషా రెబ్బ)ని ప్రేమిస్తాడు. కానీ ఈ విషయం అతడికి తెలిసేలోపు నిశ్చితార్ధం కూడా చేసుకోవాలని అనుకుంటారు. తను ప్రేమించిన అమ్మాయి హోం మినిష్టర్ కూతురు కాదని తెలిసిన తరువాత డైమండ్ బాబు ఏం చేశాడు..? తన ఇంటికి ఒక పనమ్మాయి కోడలిగా రావడాన్ని రత్నంబాబు యాక్సెప్ట్ చేస్తాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
నేటికాలంలో డబ్బుకి ప్రాధాన్యతనిస్తూ బ్రాండ్ కి ఇచ్చే విలువ సాటి మనిషికి ఇవ్వడం లేదు. ఇదే పాయింట్ ను తన స్టైల్ లో ఎంటర్టైనింగ్ గా రాసుకున్నాడు మారుతి. ఒక రిచ్ ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా. గతంలో సంపన్న కుటుంబమైనా.. కొడుకు ప్రేమించిన అమ్మాయి కోసం దిగి వచ్చి అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకున్న కథలు చూశాం. కానీ ఈ సినిమా మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. హీరో అతడి ఫ్యామిలీ సన్నివేశాలు మంచి కామెడీను పుట్టిస్తాయి. ముఖ్యంగా మురళీశర్మ పాత్ర ఎప్పుడూ బ్రాండ్ బ్రాండ్ అంటూ తిరగడం ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్. హీరో తన ఇద్దరు అసిస్టెంట్స్ తో కలిసి తను ప్రేమించిన అమ్మాయిని పడేయడం కోసం పడే ఇబ్బందులు తెరపై నవ్వులు పూయించాయి.

బ్రాండ్ లేకపోతే ఏది ముట్టుకోని హీరో తన ప్రేమ ఐస్ క్రీమ్ బండి నడుపుతుండడం, ఇదంతా చూసి తననే ప్రేమిస్తున్నాడనుకొని మినిష్టర్ ఇంట్లో పనిమనిషి అతడిని ప్రేమించడం.. ఈ అంశాలన్నీ కూడా కామెడీతో నింపేశాడు మారుతి. దాన్ని అంతే ఎంటర్టైనింగ్ గా రూపొందించాడు దర్శకుడు ప్రభాకర్. మూడు క్యారెక్టర్ల చుట్టూ కన్ఫ్యూజన్  క్రియేట్ ఆడియన్స్ ను కాస్త తికమక పెట్టాడు.  అప్పటివరకు రెండు పాటలు, కొంత కామెడీ అని నడిచిన కథలో ఇంటర్వెల్ టైమ్ కి వచ్చేసరికి ట్విస్ట్ రివీల్ అవుతుంది. తను ప్రేమించింది పని మనిషినని హీరోకి ఎప్పుడైతే తెలుస్తుందో.. సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందోననే ఆసక్తి క్రియేట్ అవుతుంది. కానీ ఫస్ట్ హాఫ్ తీసినంత ఎంటర్టైనింగ్ గా సెకండ్ హాఫ్ నడిపించలేకపోయారు.

అప్పటివరకు కామెడీగా నడిచిన కథలో కొత్తగా ఎంటర్ అయ్యే క్యారెక్టర్లు, మధ్యలో మీడియాను తీసుకురావడం ప్రేక్షకులకు బోర్ కలిగించే అంశాలు. క్లైమాక్స్ రొటీన్ గా ఉండకూడదని దాన్ని సాగదీస్తూ మరింత రొటీన్ గా తీశారు. సెకండ్ హాఫ్ లో ఈ సీన్ బాగుందని చెప్పుకునేలా ఒక్కటి కూడా అనిపించదు. హీరోగా సుమంత్ శైలేంద్రకు మొదటి సినిమా. మరీ ఎక్స్ ట్రాడినరీ  అని చెప్పుకునేలా లేకపోయినా.. ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు. కానీ తనకున్న ఫీచర్స్ వచ్చిన నటనతో ఇండస్ట్రీలో ఎంతకాలం హీరోగా రాణించగలడో సందేహమే. కాస్ట్లీ బ్రాండ్ బట్టలు, లగ్జరీ కార్ లలో కనిపించినా ఆ రిచ్ లుక్ అనేది హీరోకి రాలేదు. ఈషా పనిమనిషి పాత్రలో సరిగ్గా సూట్ అయింది. ఆమె వేసుకునే బట్టలు, మేకప్ పాత్రకు తగ్గట్లుగా ఉన్నా.. హీరోయిన్ క్యారెక్టర్ ను పనిమనిషిగా రెండున్నర గంటలు స్క్రీన్ మీద చూడడం కష్టమే. తన నటనతో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పూజిత పొన్నాడను సినిమాలో అందంగా చూపించారు.

ఈ సినిమాకు మెయిన్ అసెట్ మురళీశర్మ నటన. సినిమాలో అతడి పాత్ర మాత్రమే ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్ లో తన హావభావాలతో మెప్పించాడు మురళీశర్మ. రాజా రవీంద్ర నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఓకే అనిపించాడు. ఇక దాదాపు సీరియల్లో కనిపించే ఆర్టిస్టులనే సినిమాలో తీసుకున్నాడు ప్రభాకర్. టెక్నీకల్ గా ఈ సినిమాను క్వాలిటీతో రూపొందించారు. కానీ తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా సినిమాను పూర్తి చేసేశారు. సినిమాలో ఎక్కువ లొకేషన్స్ కూడా కనిపించవు. పాటలు ఆకట్టుకుంటాయి. నేపధ్య సంగీతం కూడా బాగుంది. ఫొటోగ్రఫీ కథకు తగ్గట్లుగా ఉంది. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. దర్శకుడిగా ప్రభాకర్ పనితనం కొంతవరకు మెప్పిస్తుంది. బ్రాండ్ లను కాకుండా మనుషులను ప్రేమిస్తూ, బంధాలకు-బాంధవ్యాలు ఎక్కువ ప్రాముఖ్యనివ్వాలని చెప్పే ఈ కథ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ కొద్దిసేపు నవ్వుకోవడానికి మాత్రం ఒకసారి ఈ సినిమాను చూడొచ్చు. 

రేటింగ్: 2/5   

Follow Us:
Download App:
  • android
  • ios