కొన్ని కులాలను, మతాలను టార్గెట్ చేస్తూ తీసే సినిమాలకు ఇబ్బందులు వస్తూంటాయి. ఎలోగాలా సెన్సార్ నుంచి బయిటపడి రిలీజ్ అయినా ఆ తర్వాత ఆ కుల,మతాల నుంచి వచ్చే వేడిని తట్టుకోగలగాలి. అయితే వివాదం ముందే ఊహించినప్పుడు అదో పెద్ద సమస్యగా కనిపించదు. ఇప్పుడీ విషయం ప్రస్దావన ఎందుకంటే... తాజాగా బాలీవుడ్ లో రిలీజైన ‘ఆర్టికల్ 15’వివాదాలను ఎదుర్కొంటోంది.

వివరాల్లోకి వెళితే... బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం‘ఆర్టికల్ 15’. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15లోని మతం, కులం, జాతి, లింగబేధం వంటి అంశాలను ప్రస్తావిస్తూ తెరకెక్కింది. అయితే విడుదలకు ముందే విమర్శలకు గురైన ఈ సినిమా విడుదల తర్వాత బ్రహ్మణ సంఘాల ఆగ్రహానికి గురవుతౌ వార్తలకు ఎక్కింది.

బ్రాహ్మణ కుల మనోభావాలను కించపరిచేవిధంగా సినిమా తీశారంటూ బ్రాహ్మణ హక్కుల జేఏసీ నాయకులు ‘ఆర్టికల్ 15’ సినిమాపై మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేశారు. అలాగే బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నిర్మించిన ఆర్టికల్ 15 సినిమాను వెంటనే రద్దు చేయాలని బ్రాహ్మణ సంఘాల జేఏసీ నాయకులు ఫిర్యాదులో కోరారు. 

ఈ సినిమాలోని ఓ సంఘటనలో ఓ అమ్మాయిని బ్రాహ్మణులు అత్యాచారం చేసినట్లు చూపించారని, అలా చూపించడం వల్ల బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతిన్నాయని, అభ్యంతరకరంగా ఉన్న ఆ సినిమాను వెంటనే దియేటర్ల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో బ్రాహ్మణ సమాజాన్ని ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2014 బదౌన్ గ్యాంగ్ రేప్ ఘటన ఆధారంగా వాస్తవ అంశాలను చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు అనుభవ్ సిన్హా.