టాలీవుడ్ లో ఉన్న మాస్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరని చెప్పాలి. మాస్ పల్స్ బాగా తెలిసిన ఈ డైరెక్టర్ హిట్టు మీద హిట్టు కొడుతూనే ఉన్నాడు కానీ రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన 'వినయ విధేయ రామ' సినిమాకి మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది.

ఈ సినిమాను దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన బోయపాటి తన తదుపరి సినిమా కూడా కూడా ఇదే రేంజ్ బడ్జెట్ లో తీయలనుకుంటున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఎన్.బి.కె బ్యానర్ పై బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అయితే ఈ సినిమా కోసం రూ.70 కోట్ల ఖర్చవుతుందని బోయపాటి అంచనా వేస్తున్నాడు. దానికి తగ్గట్లుగా ప్లానింగ్ ని బాలకృష్ణకి చెప్పబోతున్నాడు. బాలయ్యకి డెబ్బై కోట్ల మార్కెట్ లేనప్పటికీ బోయపాటి మాత్రం బడ్జెట్ విషయంలో రాజీ పడడం లేదు. మాసివ్ భారీ బడ్జెట్ గా సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.

మరి ఇంత బడ్జెట్ అంటే బాలయ్య ఒప్పుకుంటాడా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా వంద కోట్లు క్రాస్ చేస్తుందనుకుంటే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలాంటిది బాలయ్య హీరోగా ఓ మాస్ సినిమా, డెబ్బై కోట్ల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. పైగా బోయపాటి 'వినయ విధేయ రామ' లాంటి కథతో పెద్ద ఫ్లాప్ అందుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!