రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. విడుదలకు ముందు నిర్మాతలు బిజినెస్ బాగా చేసుకోవడంతో వాళ్లకు నష్టాలేవీ రాలేదు.

కానీ బయ్యర్లు మాత్రం నష్టపోయారు. దీంతో చరణ్, దానయ్య ఐదు కోట్లు చొప్పున బయ్యర్లకు తిరిగివ్వాలని అనుకున్నారు. బోయపాటిని కూడా అడిగారు. దానికి ఆయన అంగీకరించకపోవడంతో పెద్ద రచ్చ జరిగింది. ఇప్పుడు ఈ గొడవపై ఓ క్లారిటీ వచ్చేసింది. చరణ్, దానయ్య ఐదు కోట్లు చొప్పున తిరిగి చెల్లించారు.

కానీ బోయపాటి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. మధ్యవర్తులుగా కూర్చున్న దిల్ రాజు కారణంగా మొదట కోటి రూపాయలు ఇస్తానని చెప్పిన బోయపాటి.. దానయ్యతో వచ్చిన విబేధాల కారణంగా అసలు ఒక్క రూపాయి కూడా తిరిగిచ్చేది లేదని తేల్చిచెప్పాడట బోయపాటి. 

సినిమా లాభ, నష్టాలతో తనకు సంబంధం లేదని అది పూర్తిగా నిర్మాతల బాధ్యత అని నష్టపరిహారం ఇవ్వడం కుదరదని చెప్పేశాడట. ఇది ఇలా ఉండగా.. బోయపాటికి అడ్వాన్స్ లు ఇచ్చిన కొందరు నిర్మాతలు అతడి వద్ద నుండి తిరిగి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. కానీ అతడు మాత్రం డబ్బులు వెనక్కి ఇవ్వడానికి అంగీకరించడం లేదని  సమాచారం.