సరైనోడు’ సక్సెస్ తర్వాత మాంచి కిక్కు మీదున్న బోయపాటి శ్రీను మళ్లీ రంగంలోకి దిగారు. ఈసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో కొత్త చిత్రం తెరకెక్కుతోంది. కొత్త సినిమా కార్యాలయంలో ఘనంగా మూవీ ప్రారంభమైంది.

ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ కొత్త చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సినిమా కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కుమార్తె మిర్యాల ద్వారక, దర్శకుడి కుమార్తె బోయపాటి జోషిత క్లాప్‌నిచ్చారు. బోయపాటి హర్షిత్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఒక మంచి కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ‘సరైనోడు’ తర్వాత బోయపాటి శ్రీను చేస్తున్న చిత్రం మా సంస్థది కావడం ఆనందంగా ఉంది. ప్రేమ, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ కథలో బోయపాటి మార్క్‌ వినోదం, యాక్షన్‌ ఉంటాయి. కథానాయకుడు సాయి శ్రీనివాస్‌ కొత్త లుక్‌తోపాటు, ఓ సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ నెల 16 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కళ: సాహి సురేష్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్లు: రామ్‌లక్ష్మణ్‌, ఛాయాగ్రహణం: రిషి పంజాబి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.