న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కింది బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్(BFH). విశ్వంత్, మాళవిక సతీశన్, పూజా రామచంద్రన్ హీరో హీరోయిన్స్ గా నటించారు. దర్శకుడు సంతోష్ కంభంపాటి తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదలైంది.  

కథ:
అర్జున్(విశ్వంత్ దుడ్డుంపూడి) ఒక విచిత్రమైన ప్రొఫెషన్ ఎంచుకుంటాడు. ఎవరైనా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అవసరమైతే అర్జున్ ని హైర్ చేసుకోవచ్చు. అద్దెకు వచ్చినప్పటికీ ఒక రియల్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చే అన్ని కంఫర్ట్స్, ఫెసిలిటీస్ అర్జున్ వద్ద ఉంటాయి. అమ్మాయితో మంచిగా గడపడం, ఏదైనా సమస్యలు వస్తే తీర్చడం అన్నీ చేస్తాడు.ఈ అద్దె బాయ్ ఫ్రెండ్ అర్జున్ జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. ఆ సంఘటన ఏమిటీ? అసలు అర్జున్ అద్దె బాయ్ ఫ్రెండ్ గా మారడానికి గల కారణాలు ఏమిటీ? అర్జున్ కి నిజమైన గర్ల్ ఫ్రెండ్ దొరికిందా? అనేది మిగతా కథ... 
విశ్లేషణ:

కేరింత సినిమాతో వెండితెరకు పరిచయమైన విశ్వంత్... క్రేజీ క్రేజీ ఫీలింగ్స్, ఓ పిట్ట కథ వంటి చిత్రాల్లో హీరోగా చేశారు. మరలా బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ మూవీతో ఆయనకు హీరోగా అవకాశం వచ్చింది. ఒక వైవిధ్యమైన పాత్రలో విశ్వంత్ ఒదిగిపోయి నటించారు. సినిమాను అన్నీ తానై నడిపించాడు. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన మెప్పిస్తుంది. 

హీరోయిన్ మాళవిక సతీశన్ ఈ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. లీడ్ రోల్ దక్కించుకున్న మాళవిక నటన పర్లేదు అని చెప్పాలి. పూజా రామచంద్ర తన పాత్ర పరిధి మేర మెప్పించారు. హర్షవర్ధన్, రాజారవీంద్ర, మధుసూదన్ ఆకట్టుకున్నారు. 

దర్శకుడు సంతోష్ కంభంపాటి న్యూ ఏజ్ లవ్ పాయింట్ ని కథగా ఎంచుకున్నాడు. బాయ్ ఫ్రెండ్ అద్దెకు అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది.అయితే ఆ కథకు ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ బోరింగ్ గా సాగింది. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ని ఆయన వేస్టు చేశాడనిపిస్తుంది. అలాగే హీరో అద్దె బాయ్ ఫ్రెండ్ గా మారడానికి బలమైన కారణం, ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడంతో సినిమా తేలిపోయింది. గోపి సుందర్ పాటలు పర్లేదు. బీజీమ్ ఆకట్టుకుంటుంది. ఇతర సాంకేతిక అంశాలు పర్లేదు. 

ప్లస్ పాయింట్స్ 
కథ బీజీఎమ్ 

మైనస్ పాయింట్స్ 
కథనం సాంగ్స్ ఎమోషన్స్ 

ఒక న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఒక కొత్త స్టోరీ లైన్ ఎంచుకున్న దర్శకుడు కథను ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. బలమైన ఎమోషన్స్ కూడా లేకపోవడంతో సినిమా నిరాశాజనకంగా సాగింది. 

నటులు: విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీశన్, పూజా రామచంద్రన్
దర్శకుడు: సంతోష్ కంభంపాటి
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
సంగీతం: గోపీ సుందర్

రేటింగ్ : 2.25/5