ఇద్దరు సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ బాక్సాఫీస్ సమరానికి రెడీ అయ్యారు. కోలీవుడ్ స్టార్ అజిత్(Ajith Kumar), టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీస్ ఒక్కరోజు వ్యవధిలో విడుదల కానున్న నేపథ్యంలో పోటీ ఆసక్తికరంగా మారింది.
అజిత్, పవన్ (Pawan Kalyan)భారీ ఫ్యాన్ బేస్ కలిగిన స్టార్ హీరోలు. మరి ఈ ఇద్దరు స్టార్స్ నటించిన చిత్రాలు వచ్చే వారం విడుదల కానున్నాయి. అజిత్ వలిమై ఫిబ్రవరి 24న విడుదలవుతుండగా, పవన్ భీమ్లా నాయక్ 25న విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద విజయం ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాకు వలిమై (Valimai)పోటీ ఇవ్వలేదు. అదే సమయంలో తమిళనాట భీమ్లా నాయక్ ప్రభావం అంతంత మాత్రమే. అయితే వీరిద్దరికీ కామన్ పరీక్ష బాలీవుడ్ లో ఎదురుకానుంది.
పవన్, అజిత్ బాలీవుడ్ లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. పుష్ప (Pushpa) మూవీ హిందీలో ఘన విజయం సాధించింది. బాహుబలి, కెజిఎఫ్, సాహో, పుష్ప ఇలా వరుసగా సౌత్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. సౌత్ చిత్రాల పట్ల నార్త్ ప్రేక్షకులకు మక్కువ పెరిగింది. ఇక్కడ ప్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా అక్కడ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ స్టార్స్ తమ చిత్రాలు హిందీలో కూడా విడుదల చేస్తున్నారు.
టూ టైర్ హీరో రవితేజ సైతం తన లేటెస్ట్ మూవీ ఖిలాడీ హిందీలో విడుదల చేశారు. ఈ క్రమంలో పవన్, అజిత్ కూడా బాలీవుడ్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు. అలియా భట్ గంగూబాయ్ కతియావాడి మినహాయిస్తే వలిమై, భీమ్లా నాయక్ (Bheemla Nayak)చిత్రాలకు పెద్దగా పోటీలేదక్కడ. కాబట్టి సౌత్ సినిమా కేటగిరీలో ప్రధాన పోటీ పవన్, అజిత్ మద్యే ఉంటుంది. వీరిద్దరిలో బాలీవుడ్ లో జెండా పాతేది ఎవరో చూడాలి.
గతంలో పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని హిందీలో విడుదల చేశారు. అది అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు. మరలా చాలా కాలం తర్వాత భీమ్లా నాయక్ చిత్రంతో హిందీ బెల్టులో అడుగుపెడుతున్నారు. అజిత్ నటించిన ఒక్క చిత్రం కూడా హిందీలో విడుదల కాలేదు. అయితే 2001లో షారుక్ ఖాన్ హీరోగా విడుదలైన అశోక చిత్రంలో అజిత్ క్యామియో రోల్ చేశారు.
మరోవైపు తనకంటే వెనుక స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రభాస్, అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతుంటే పవన్ పై ఒత్తిడి పెరిగింది. అజిత్ కి మరో కోలీవుడ్ స్టార్ విజయ్ నుండి తీవ్ర పోటీ ఎదురవుతుంది. పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకోవడమే అసలైన స్టార్ డమ్ అన్నట్లు పరిస్థితి తయారైంది. సొంత భాషలో ఎంత పెద్ద స్టార్ అయినా అది లెక్కలోకి రావడం లేదు. పొరుగింట్లో కూడా గెలిచిన హీరోనే నంబర్ వన్ అంటున్నారు. దానికి తోడు బాలీవుడ్ లో మార్కెట్ ఏర్పడిన హీరోల రెమ్యూనరేషన్ వంద కోట్లకు చేరుకుంది.
