అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి అభిమానుల గుండెల్ని చిదిమేసి అర్థాంతరంగా తనువు చాలించి.. అర్థంకాని చరిత్రగా మిగిలిపోయింది. లక్షలాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సాక్షిగా శ్రీదేవి భూలోకం విడిచి ఇంద్రలోకానికి తరలిపోయింది. మళ్లీ అంగులీకము పారేసుకుని భువిపైకి తిరిగి రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయుల కలల రారాణి, ఇంద్రలోకం నుంచి వచ్చిన పని ముగించుకున్నట్లు మధ్యలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే ఆమె వెళ్లిపోయిన తీరు మాత్రం ఓ మిస్టరీగానే మిగిలి పోవటం కలచివేస్తున్న అంశం.

 

శ్రీదేవి దుబాయ్ లో బాత్ టబ్ లో మరణించారనేది మాత్రమే అందరికి తెలిసిన విషయం. కానీ బాత్ టబ్ లో ఎలామరణించారు, హోటల్ గదిలో అసలు ఏం జరిగింది.. అనేది మాత్రం రహస్యంగా మిగిలిపోయింది. ఇక లక్షలాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య శ్రీదేవి అంతిమ యాత్ర సాఫీగా జరిగింది. దుబాయ్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో శ్రీదేవి చివరి మజిలీ సాఫీగా జరుగుతుందా అనే అనుమానాలు సగటు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. మొత్తానికి దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ శ్రీదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ఆందోళన వైదొలిగి, అభిమానులు ఆమెని కడసారి చూసుకునే అవకాశం కలిగింది.

 

ఇదిలావుంటే.. శ్రీదేవి మరణం తరువాత ఆమె భర్త బోనికపూర్ తొలిసారి స్పందించారు. ఆయన స్పందన కూడా శ్రీదేవి అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి రావటమేకాక చాలా ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. స్నేహితురాలి లాంటి భార్య, నా ఇద్దరు కుమార్తెల తల్లి అయిన శ్రీదేవిని కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేననని బోనికపూర్ అన్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నా కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, కోట్లాది మంది శ్రీదేవి అభిమానులు అండగా నిలిచారని బోనికపూర్ అన్నారు. వారందరికీ తాను రుణపడి ఉంటానని బోనికపూర్ తెలిపారు. ముఖ్యంగా తన కుమారుడు అర్జున్ కపూర్ మరియు కుమార్తె అన్షులా ఇద్దరూ తనతోపాటు జాన్వీ, ఖుషికపూర్ లకు అండగా నిలిచారని బోనీ చెప్పుకొచ్చారు. అర్జున్, అన్షులా తమని ఓదార్చి ధైర్యం నింపి పిల్లర్ల మాదిరిగా నిలిచాలని బోనీ అన్నారు. అర్జున్ కపూర్, అన్షులా సహా తామంతా కుటుంబంగా శ్రీదేవి పోయిన దుఃఖాన్ని అధికమించడానికి ప్రయత్నించామని బోనికపూర్ అన్నారు. ఈ ప్రపంచానికి, తన అభిమానులకు శ్రీదేవి ఎప్పటికి వారి చాందినిగా గుర్తుంటుంది. కానీ నాకు ఆమె జీవిత భాగస్వామి, ప్రియమైన భార్య. నా ఇద్దరు పిల్లలు జాన్వీ, ఖుషికి వారి తల్లే సర్వస్వం అని బోనికపూర్ అన్నారు. తన కుటుంబానికి రక్షణ కవచం లాంటి తన భార్యని కోల్పోయాం అని ఎమోషనల్ అయ్యారు బోనీ. ఇలాంటి సమయంలో తమకు ప్రైవసీ కల్పించాలని బోనికపూర్ కోరారు. శ్రీదేవితో అనుబంధం వున్న వారు ఆమెతో తమకున్న జ్ఞాపకాల గురించి మాట్లాడాలని, ఊహాగానాలకు స్వస్తి చెప్పాలని బోనికపూర్ పరోక్షంగా ప్రస్తావించారు. శ్రీదేవి దూరమైన ఈ పరిస్థితుల్లో తాను జాన్వీ, ఖుషిల భవిషత్తు గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని బోనికపూర్ అన్నారు. శ్రీదేవి లేని ఈ క్లిష్ట పరిస్థితుల్లో.. జాహ్నవి,ఖుషీలను సంరక్షిస్తూ.. తమ జీవితం, బలం, చిరునవ్వు అన్నీ శ్రీదేవి అని, శ్రీదేవి లేదన్న సత్యాన్ని గ్రహించి పిల్లలు జీవితంలో ముందుకు సాగేలా ధైర్యం కలగించాలన్నదే తన ముందున్న కర్తవ్యం అన్నారు. శ్రీదేవి పట్ల తమకున్న ప్రేమాభిమానాలకు కొలమానం లేదని తేల్చి చెప్పారు బోనీకపూర్. చివరగా.. ప్రియమైన శ్రీదేవి, మా జీవితాలు ఇకపై నువ్వున్నప్పటిలా వుండబోవని, నీ ఆత్మకు శాంతి కలగాలని, నువ్వు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరని బోనికపూర్ తన ప్రకటనని ముగించారు.