శ్రీదేవి మరణం తర్వాత కపూర్ కుటుంబంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎడమొహం పెడమొహంలా జాన్వీ-ఖుషిలతో చాలా గ్యాప్ మైంటైన్ చేసిన బోనీ మొదటి భార్య సంతానం అన్షులా - అర్జున్ కపూర్ లలో చాలా మార్పు రావడం బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అర్జున్ తండ్రికి నైతిక బలం ఇవ్వడానికి చేయగలిగింది అంతా చేస్తున్నాడు. ఇటీవలే బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్ళను వెంటబెట్టుకుని అర్జున్ కపూర్ ఇంటికి వెళ్ళడం  చర్చనీయాంశంగా మారింది. లోపల ఏం మాట్లాడుకున్నారు అనేది బయటికి తెలిసే ఛాన్స్ లేదు కాని బయటికి వచ్చాక కొడుకుని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి సెలవు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

శ్రీదేవి దుబాయ్ లో అకాల మరణం చెందినప్పటి నుంచి సాధ్యమైనంత వరకు తండ్రితోనే ఉండడానికి ప్రయత్నిస్తున్న అర్జున్ కపూర్ తన షూటింగ్స్ కు ఇబ్బంది కలుగుతున్నా అవేవి లెక్క చేయటం లేదట. మరోవైపు ఏనాడూ మాట్లాడుకోని అన్శులా కపూర్ ఇప్పుడు జాన్వీ-ఖుషిలకు మంచి ఫ్రెండ్ గా మారిపోయింది. ఈ మధ్యే శ్రీదేవి కూతుళ్ళ గురించి ఒకడు అసభ్యంగా కామెంట్ చేస్తే నా చెల్లెళ్ళను ఏమైనా అంటే ఊరుకునేది లేదని అన్షులా వార్నింగ్ ఇవ్వడం బాగా ప్రచారం అయ్యింది. దానికి తోడు ఆ మరుసటి రోజే అన్షులాలా జాన్వీ ట్విట్టర్ లో ఫాలో కావడం మొదలు పెట్టింది. దీన్ని బట్టి ముందు రెండు కుటుంబాల మధ్య ఎంతటి అగాధం ఉండేదో అర్థమవుతుంది.

శ్రీదేవి ఫాన్స్ మాత్రం ఈ మాత్రం ప్రేమ - కలయిక ఆమె బ్రతికి ఉన్నప్పుడే జరిగి ఉంటే ఇంకా బాగుండేదని నిట్టూరుస్తున్నారు . ఆవిడ బ్రతికి ఉండగా తన పిన తల్లి అని ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడని అర్జున్ కపూర్ ఇప్పుడు కాబట్టి మారాడు కాని లేకపోతే పరిస్థితిలో పెద్ద మార్పు ఉండేది కాదు. జాన్వీ నటిస్తున్న డెబ్యు మూవీ ధడక్ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. శ్రీదేవికి ఘనమైన నివాళిగా జూన్ లో భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.