వివాదాస్పద అంశాలు తో కూడిన ట్రైలర్స్, మత కలహాలు రేపే సినిమాల విషయంలో న్యాయస్ధానాలు కఠినంగానే వ్యవహిస్తున్నాయి. ఎట్టి పరిస్దితుల్లోనూ అలాంటి వాటిని జనాల్లోకి వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెప్తున్నాయి. తాజాగా వసీం రిజ్వీ నిర్మించిన ‘రామజన్మభూమి’ చిత్రం ట్రైలరును యూట్యూబ్ లో పెట్టవద్దంటూ బాంబే హైకోర్టు ఆంక్షలు విధించింది. 

వివరాల్లోకి వెళితే.. బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం దేశంలో మత కల్లోలాలు జరిగిన నేపథ్యంలో ‘రామజన్మభూమి’ పేరిట నిర్మించిన చిత్రం రెండు మతాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉందని, ఈ చిత్రానికి ఫిలిం సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ లేకుండానే దాన్ని యూట్యూబ్‌లో పెట్టారని సామాజికవేత్త అజహర్ తంబోలి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 

‘రామజన్మభూమి’ చిత్రం ట్రైలరును యూట్యూబ్ లో పెట్ట వద్దని ఆంక్షలు విధిస్తూ బాంబే హైకోర్టు జస్టిస్ బీపీ ధర్మాధికారి, జస్టిస్ సారంగ్ కొత్వాల్ లు తీర్పు వెలువరించారు. ఈ చిత్రం మతకలహాలను రేపేలా ఉందని,ఇది సినిమాటోగ్రఫీ యాక్ట్ 5 బి సెక్షన్ ప్రకారం ఉల్లంఘన అని అందుకే ఈ చిత్రం ట్రైలరును నిలిపివేయాలని ఆదేశిస్తున్నట్లు బాంబే హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.