గత రాత్రి చెన్నై పోలీసులకు ఓ అపరిచితుడు హీరో ధనుష్ ఇంటిలో బాంబు ఉన్నట్లు బెదిరించాడు. దీనితో పోలీసులు ఒక్కసారిగా అలెర్ట్ కావడంతో పాటు, హుటాహుటిన ధునుష్ ఇంటికి చేరుకున్నారు. బాంబులను నిర్వీర్యం చేసే బృందం ధనుష్ ఇంటి పరిసరాలు మొత్తం జల్లెడ పట్టారు. గంటల కొలది హై టెన్షన్ అక్కడ చోటు చేసుకుంది. ఆణువణువూ గాలించిన పోలీసులు, అక్కడ ఎటువంటి పేలుడు పదార్ధం లేదని నిర్ధారణకు వచ్చారు. 

దీనితో ఇది ఎవరో ఆకతాయి పని కావచ్చని పోలీసులు భావించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ మొదలుపెట్టారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆ దుండగుడిని పట్టుకొనే ప్రయత్నం మొదలుపెట్టారు. చెన్నైలో ప్రముఖ హీరోలకు ఈ తరహా బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయాయి. కొన్ని నెలల క్రితం రజని కాంత్ ఇంటిలో బాంబ్ ఉందని ఒకరు బెదిరించారు. రజిని ఇల్లు జల్లెడ పట్టిన పోలీసులు అది ఒక ఫేక్ కాల్ అని గుర్తించారు. ఆ ఫోన్ చేసిన బాలుడు మతిస్థిమితం లేనివాడని తెలుసుకొని, అతన్ని వదిలేశారు. 

హీరో అజిత్, విజయ్ నివాసాలలో బాంబులు పెట్టినట్లు ఫేక్ కాల్స్ రావడం జరిగింది. ప్రముఖులు కావడంతో పాటు విషయాన్ని తేలికగా తీసుకోకుండా పోలీసులు ప్రతిసారి పరుగులు పెట్టాల్సివస్తుంది. ఆకతాయిలు మాత్రం తరచుగా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ధనుష్ ఇంటిలో బాంబ్ లేదన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మరియు ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.