రియల్ హీరో సోనూసూద్ Sonu Sood తన అభిమానులను అలర్ట్ చేశారు. డీప్ ఫేక్ రాయుళ్లు ఆయన్ని కూడా వదలకపోవడంతో అభిమానులకు కీలక సూచన చేశారు. 

బాలీవుడ్ స్టార్, రియల్ హీరో సోనూ సూద్ (Sonu sood) సినిమాలతో కంటే... తన మంచి మనస్సుతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను దేశ ప్రజలు ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ సోనూసూద్ తనవంతుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూనే వస్తున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. 

ఇక ఇటీవల ఇండస్ట్రీలో సెలబ్రెటీలు డీప్ ఫేక్ Deep Fake వీడియోలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్యలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లను కొందరు డీప్ ఫేక్ రాయుళ్లు తమ ఫొటోలను వీడియోను మార్ఫింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళనే రష్మిక మందన్న వీడియోను క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలో తాజాగా సోనూసూద్ కూడా డీప్ ఫేక్ రాయుళ్లపై స్పందించారు. ‘నా సినిమా ‘ఫతే’ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉంటుంది. ఈ మూవీలో డీప్ ఫేక్, ఫేక్ లోన్ యాప్స్ ద్వారా జరుగుతున్న సైబర్ నేరాలను చూపించాం. ఇదే ఘటన తాజాగా జరిగింది. ఇందులో చాటింగ్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా నేనే అని నమ్మించి ఒక కుటుంబం దగ్గర నుండి డబ్బులు దోచే ప్రయత్నం చేశారు. ఈ ట్రాప్‌లో చాలా మంది ఇరుక్కుంటున్నారు. మీరందరూ ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలి’ అంటూ సూచించారు. ఈ మేరకు ట్వీటర్ వేదికన ఆ వీడియోను కూడా పంచుకున్నారు.

Scroll to load tweet…