‘కేజీఎఫ్2’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 3’ని కూడా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ లో బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై నిర్మాత కిరగందూర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.  

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా సత్తాను చాటింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘కేజీఎఫ్’ సెన్సేషన్ క్రియేట్ చేసి బాక్సాఫీసు వద్ద చెరగని ముద్ర వేసుకుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`ని దాటుకుని, `బాహుబలి` రికార్డుల దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ సినిమా సృష్టించే సంచలనాలపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. మొత్తంగా సుమారు రూ. 1200 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఎండింగ్ లో KGF3 కూడా రాబోతున్నట్టు దర్శకుడు ప్రశాంత్ హింట్ ఇచ్చాడు. దీంతో అందరి ఫోకస్ ప్రస్తుతం ‘కేజీఎఫ్ 3’పైనే ఉంది.

అయితే ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ `సలార్‌` చిత్ర షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం 30 నుంచి 35 శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నిన్ననే తాజాగా మరో షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు యూనిట్. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. నవంబర్ వరకు Salaar షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. తర్వాత ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 3’పైనే ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ కరగందూర్ కేజీఎఫ్ 3పై ఇంట్రెస్టింగ్ న్యూస్ అందించారు. 

ఇప్పటికే కేజీఎఫ్2లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టండన్ ను కీలక పాత్రల్లో ఎంపిక చేశారు ప్రశాంత్ నీల్. దీంతో కేజీఎఫ్ ఛాప్టర్ 3లోనూ మరో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ను తీసుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై నిర్మాత విజయ్ తాజాగా ఏషియానెట్ న్యూస్‌బుల్‌తో ప్రత్యేకంగా సంభాషించారు. ‘మూడో భాగంలో అదనంగా ఇంకా ఏ స్టార్ కాస్ట్‌ ని చేర్చబోతున్నామనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. చాప్టర్ 3 ఈ సంవత్సరం జరగదు. మాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, అయితే ప్రశాంత్ (నీల్) ప్రస్తుతం సాలార్‌తో బిజీగా ఉన్నాడు. యష్ (Yash) కూడా తన కొత్త చిత్రాన్ని త్వరలో ప్రకటించనున్నారు. కాబట్టి KGF3ని ప్రారంభించడానికి సరైన సమయం రావాల్సి ఉంది. అందుకే ఈ సీక్వెన్స్ లో హృతిక్ రోషన్ నటిస్తారా లేదా మరే ఇతర స్టార్స్ అన్నది ఇప్పుడే చెప్పలేం.’ అని వివరించాడు.

 అయితే ఛాప్టర్ 2 రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందీ ప్రాంతంలో రూ. 430.95 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ప్రపంచ బాక్సాఫీస్ కలెక్షన్ల వద్ద రూ. 1250 కోట్ల మార్కును దాటడంతో కేజీఎఫ్ కు ఉన్న డిమాండ్ అర్థమవుతోంది. ఇక కేజీఎఫ్ 3లో బాలీవుడ్ గ్రీక్ వీరుడు, యాక్షన్ హీరో హృతిక్ రోషన్ నటిస్తారనే ఊహే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం హృతిక్ ‘విక్రమ్ వేద’, ‘ఫైటర్’ చిత్రాల్లో నటిస్తున్నారు.