కరోనాతో బాలీవుడ్ సీనియర్ నటి ఆశాలత కన్నుమూత
బాలీవుడ్ నటి ఆశాలత వబ్‌గాంకర్(79) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆమె సతారాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. ఇది ఇండియాలో మరింతగా విజృంభిస్తోంది. ఓ రకంగా విలయతాండవం చేస్తుంది. కరోనా దెబ్బకి మాజీ రాష్ట్రపతినే కన్నుమూశారు. సినీ ప్రముఖులు సైతం కరోనాకి బలవుతున్నారు. ఓవైపు గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం అంచుల వరకు వెళ్ళి ప్రాణాలతో పోరాడుతున్నారు.
తాజాగా బాలీవుడ్ నటి ఆశాలత వబ్‌గాంకర్(79) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆమె సతారాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆశాలత మరాఠి భాషల్లో కూడా నటించి ఆకట్టుకున్నారు. అయితే మరాఠీలో ఆమె చేస్తున్న `ఆయి మజి కలు బాయి` టీవీ షో షూటింగ్ టైమ్‌లో కరోనా సోకిందట. దీంతో అందరు హోం క్వారంటైన్ అయిపోయారు. వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆశాలత కరోనాతో పోరాడి ఓడిపోయారు. మూడు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు.
గోవాలో జన్మించిన ఆశాలత మరాఠీలో రంగస్థల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటగా కొన్ని కొంకణీ సినిమాల్లోనూ నటించారు. అట్నుంచి మరాఠీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకున్నారు.
`అప్నే పరయే`, `వాహ్ సాత్ దిన్`, `యాదోమ్ కసమ్`, `నమక్ హలాల్`,`జంజీర్`, `అంకుష్`, `వాహ్ 7దిన్`, `అహిస్టా అహిస్టా`, `శౌకీన్`, `కూలీ`, `జమానా`, `రాజ్ తిలక్` వంటి పలు హిందీ సినిమాల్లో కూడా నటించారు. టీవీ సీరియల్స్ తల్లిగా, అత్తగా, బామ్మగా మెప్పించింది. కొంకణీ, మరాఠీ, హిందీ భాషల్లో వందకుపైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె `గార్డ్ శభోవతి` అనే పుస్తకాన్ని కూడా రాశారు.
ఆమె మృతి పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం తెలిపారు. షబానా అజ్మీ, నిమ్రత్ కౌర్, గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ వంటి ప్రముఖులు సంతాపం తెలిపారు.