నెలల వ్యవధిలో మూడు బాక్సాఫీస్ హిట్లు. అది కూడా బాలీవుడ్ సినిమాలకు తూట్లు పొడుస్తూ. ఈ దండయాత్రకు కారణం తెలియక బాలీవుడ్ జుట్టు పీక్కుంటుంది.
బాహుబలి సిరీస్ సక్సెస్ ఏదో గాలివాటం అనుకుంది బాలీవుడ్. కాలం కలిసొచ్చి ఒకసారి కాసులు కురిపించినంత మాత్రాన, సౌత్ నార్త్ ని ఏలేస్తుందా? అని అతి విశ్వాసం ప్రకటించారు. అయితే వాళ్ళ నమ్మకాన్ని, బలాన్ని ఒక్కొక్క సౌత్ మూవీ బలహీన పరుస్తూ వచ్చాయి. సాహో మూవీ విజయంతో ప్రభాస్ మరోసారి సవారీ చేశారు. పాన్ ఇండియా స్టార్ బిరుదును సార్ధకం చేసుకున్నారు. వరుసగా మూడు సినిమాలు హిందీ బెల్టును షేక్ చేశాయి.
ఈ నేపథ్యంలో దేశంలోనే భారీ బడ్జెట్ చిత్రాల హీరోగా ఆయన అవతరించారు. బాలీవుడ్ స్టార్స్ ని కూడా తలదన్నుతూ అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కాగా ఆరు నెలల వ్యవధిలో మూడు బడా చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని దున్నేశాయి. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప వంద కోట్ల వసూళ్లకు చేరుకొని ఝలక్ ఇచ్చింది. పుష్ప ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి అట్టర్ ప్లాప్ ఖాయం అన్నారు. జస్ట్ రూ. 3 కోట్ల లోపే ఓపెనింగ్స్ దక్కించుకున్న పుష్ప నెల రోజుల పాటు నిరాధికంగా ఆడింది. పుష్ప (Pushpa)ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రణ్వీర్ సింగ్ 83 మూవీ వసూళ్లను దెబ్బతీసింది.
పుష్ప మేనియా తగ్గకుండానే ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) వరదలా దూసుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ ఆర్ ఆర్ అదే స్థాయి విజయం దక్కించుకుంది. పుష్ప చిత్రానికి రెట్టింపు వసూళ్లు ఆర్ ఆర్ ఆర్ దక్కించుకుంది. నాలుగవ వారం కూడా ఆర్ ఆర్ ఆర్ రన్ కొనసాగుతుండగా హిందీ వర్షన్ రూ. 250 కోట్లకు చేరువైంది. ఇక కెజిఎఫ్ 2 సునామీలా నార్త్ ఇండియా రికార్డ్స్ ముంచేసింది. హైయెస్ట్ ఇండియన్ ఓపెనర్ గా రికార్డులకు ఎక్కింది. రెండు రోజుల్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టిన కెజిఎఫ్ చాప్టర్ 2, వీకెండ్ ముగిసే నాటికే రెండు వందల కోట్లు రాబట్టడం ఖాయం. కెజిఎఫ్2 (KGF Chapter 2) జోరు నేపథ్యంలో భారీ ఫిగర్ అక్కడ సెట్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
వరుసగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటుతూ అక్కడి టాప్ స్టార్స్, డైరెక్టర్స్ టాలెంట్ కి సవాల్ విసురుతున్నాయి. సౌత్ సినిమాలు అంతగా నార్త్ ప్రేక్షకులకు ఎందుకు నచ్చుతున్నాయనే సందేహం వాళ్ళ మెదళ్లను తొలిచేస్తోంది. బాలీవుడ్ స్టార్స్ నటించిన సినిమా ఫస్ట్ డే ముక్కీ మూలిగి రూ. 10 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కష్టంగా ఉంటే, సౌత్ ఇండియా చిత్రాలు 20 నుండి 50 కోట్లు ఈజీగా రాబడుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ కి పోటీగా విడుదలైన అటాక్ దారుణమైన పరాజయం ఎదుర్కొంది. కెజిఎఫ్ చాప్టర్ 2కి బయపడి జెర్సీ మూవీ విడుదల వాయిదా వేసుకున్నారు. ఈ పరిణామాలు బాలీవుడ్ వర్గాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
