బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో కాజల్ స్థానంలో తమన్నాను ఎంపిక చేసుకున్నారని వస్తోన్న వార్తలపై బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా మండిపడ్డాడు. ఆయన తెరకెక్కిస్తోన్న 'ముంబాయ్ సాగా' అనే సినిమాలో అర్జున్ రాంపాల్, కాజల్ జంటగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుండి కాజల్ తప్పుకుందని ఆమె స్థానంలో తమన్నాను ఎంపిక చేసుకున్నారని ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఈ వార్త సంజయ్ గుప్తా చెవిన పడడంతో ఆయన సోషల్ మీడియావేదికగా క్లారిటీ ఇచ్చారు. అసలు మీడియా వర్గాలు ఇంత దారుణంగా కల్పిత వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించిన ఆయన ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు.

'ముంబాయ్ సాగా' సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశామని, కాజల్ బ్రిలియంట్ గా నటించారని చెప్పారు.  1980ల కాలం నేపథ్యంలో ముంబయి సాగా సినిమాను తెరకెక్కిస్తున్నారు సంజయ్. ఇందులో కాజల్ పాత్ర రెండు విభిన్న కోణాల్లో ఉండబోతోందని చాలా వినోదాత్మకంగా ఉంటుందని వెల్లడించారు.

ప్రస్తుతం కాజల్ నటించిన 'క్వీన్' తమిళ రీమేక్ 'పారిస్ పారిస్' విడుదలకు సిద్ధమవుతోంది. అలానే కమల్ హాసన్ నటిస్తోన్న 'భారతీయుడు 2' సినిమాలో కూడా కాజల్ నటిస్తోంది.