ప్రపంచ పర్యావరణంలో ఇప్పటికే సమతుల్యత లోపించింది. కాలుష్యంతో జీవరాశులకు ప్రాణాధారమైన ఆక్సిజన్ శాతం తగ్గుతోంది. ఇలాంటి సమయంలో మరో విపత్తు లాంటి సంఘటన బ్రెజిల్ లో జరిగింది. భూమిపైన ఉండే ఆక్సిజెన్ లో 20 శాతం బ్రెజిల్ లోని అమెజాన్ అడవుల నుంచే అందుతోంది. 

అమెజాన్ రైన్ ఫారెస్ట్ అంత ముఖ్యమైనవి. కానీ గత రెండు వారాలుగా అమెజాన్ అడవుల్లో మంటలు వ్యాపించాయి. భారీస్థాయిలో అడవి తగలబడుతోంది. దీనిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా గళం వినిపించారు. ఇంత ఘోరం జరుగుతుంటే ఏ మీడియాలోని ఈ వార్త రాలేదు అని అనుష్క శర్మ, అర్జున్ కపూర్, దియా మీర్జా లాంటి సెలెబ్రిటీలు దుమ్మెత్తిపోస్తున్నారు. 

అమెజాన్ అడవులు ఈ ప్రపంచానికి ఊపిరితిత్తుల లాంటివి. రెండు వారలు ఈ అడవి తగలబడుతోండడం బాధాకరం. ఇప్పటికే మనం కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నాం. ఈ అడవులు మనకు చాలా ముఖ్యమైనవి. దయచేసి మీడియా దీనిపై దృష్టిపెట్టాలి అని అనుష్క సోషల్ మీడియాలో స్పందించింది.

అమెజాన్ అడవులు లేకపోతే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయం వేస్తోంది. అమెజాన్ అడవుల్లో కారు చిచ్చు రాగలడం నిజంగా భయంకరమైన సంఘటన. దయచేసి అంతా అమెజాన్ అడవుల కోసం ప్రార్థించండి అని అర్జున్ కపూర్ కామెంట్ చేశాడు. 

ఇక యంగ్ హీరోయిన్ దిశా పాటని మాట్లాడుతూ.. ప్రపంచానికి ఊపిరితిత్తుల లాంటి అమెజాన్ అడవుల్లో ఇంత ఘోరం జరుగుతుంటే మీడియా మొత్తం ఏం చేస్తోంది. నేనింతవరకు ఎక్కడా ఈ వార్తని చూడలేదు. 20 శాతం ఆక్సిజెన్ అక్కడి నుంచే వస్తోందనే విషయం గుర్తించాలి అని దిశా తెలిపింది. 

దియా మీర్జా ఇంస్టాగ్రామ్లో స్పందిస్తూ ఈ ఏడాది ఇప్పటికే అమెజాన్ అడవుల్లో 72 వేల మంటలు వ్యాపించాయి. ప్రపంచ మీడియాకు ఇది ఎప్పటికి ముఖ్యమైన అంశం అని తెలుస్తుంది అంటూ మీడియాపై మండిపడింది. 

బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా అమెజాన్ లో ప్రతి ఏడాది మంటలు ఎక్కువవుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.