క్రిస్టఫర్ నోలెన్.. హాలీవుడ్ చిత్రాలని ఇష్టపడే వారు ఈ పేరుని వినే ఉంటారు. తన అద్భుతమైన క్రియేటివిటీ, దర్శకత్వ ప్రతిభతో నోలెన్.. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి లెజెండ్రీ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. తాను తెరకెక్కించే ప్రతి చిత్రంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాడు. ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ లాంటి చిత్రాలు నోలెన్ ప్రతిభకు మచ్చుతునకలు. 

ఇదిలా ఉండగా నోలెన్ తెరకెక్కించబోయే కొత్త చిత్రం 'టెనెట్'. ఈ చిత్రానికి టైటిల్ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా నోలెన్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. వచ్చే ఏడాది జులై 17న టెనెట్ చిత్రం విడుదల కాబోతోంది. 

ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సీనియర్ హీరోయిన్ డింపుల్ కపాడియా టెనెట్ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతోందట. ఈ వార్తని హాలీవుడ్ మీడియా వర్గాలు ధృవీకరిస్తున్నారు. డింపుల్ కపాడియా దీని గురించి ఇంకా స్పందించలేదు కానీ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. 

సీనియర్ హీరో అనిల్ కపూర్ ఇది గొప్ప విషయం అని ట్వీట్ చేశారు. ప్రముఖ లేడి ప్రొడ్యూసర్ గునీత్ మోంగా మాట్లాడుతూ.. డింపుల్ కాపాడియాకు దక్కిన అవకాశం నిజంగా దేశం మొత్తానికి గర్వకారణం అని అన్నారు. డింపుల్ కపాడియా గతంలో కూడా కొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. కానీ నోలెన్ లాంటి అద్భుతమైన దర్శకుడి చిత్రంలో నటించనుండడం ఇదే తొలిసారి. దాదాపు 7 దేశాల్లో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది.