సుశాంత్‌ ఆత్మహత్య కేసులో మరో సంచలన ఆరోపణ చేశారు బీజేపీ సీనియర్‌నేత సుబ్రమణియన్‌ స్వామి. సుశాంత్‌ది హత్యగా ఆరోపించారు. అంతేకాదు దుబాయ్‌తో సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన  ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ పెట్టారు. ఇదంతా దుబాయ్‌ దాదాల పని అని తెలిపారు.

గత వారం కూడా సుబ్రమణియన్‌ స్వామి.. సుశాంత్‌ కేసుకి దుబాయ్‌ దాదాలకు లింకు ఉందని ఆరోపించారు. తాజాగా దానికి బలం చేకూరుస్తూ మరో ఆరోపణ చేశారు. సునంద పుష్కర్‌కి, శ్రీదేవికి, సుశాంత్‌ మరణాలకు సంబంధాలున్నాయని తెలిపారు. 

ఆయన చెబుతూ, సునంద పుష్కర్‌ మృతి కేసులో  ఎయిమ్స్ వైద్యులు చేసిన పోస్ట్ మార్టంలో ఆమె కడుపులో ఏదైతే గుర్తించారో, అదే అసలైన ఆధారంగా నిలిచింది. కానీ శ్రీదేవిగానీ, సుశాంత్‌ మరణం విషయాల్లో అది జరగలేదు. సుశాంత్‌ హత్యకు గురైన రోజు దుబాయ్‌ డ్రగ్‌ డీలర్‌ ఆయష్‌ ఖాన్‌.. సుశాంత్‌ని కలిశాడు. ఎందుకు కలిశాడు` అని ప్రశ్నించాడు. 

అంతేకాదు ఇలాంటి హై ప్రోఫైల్‌ కేసుల్లో సీబీఐ విచారణ చేపట్టాలి, అలాగే మోసాద్‌, షిన్‌ బెత్‌ల సహాయం సీబీఐ తీసుకోవాలి. ఇజ్రాయిల్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాల నేపథ్యంలో భారతదేశానికి చెందిన దుబాయ్‌ దాదాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు` అని తెలిపారు. పరోక్షంగా ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారని తెలిపారు. సుబ్రమణియన్‌ స్వామి ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్‌లోనే కాదు, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సుశాంత్‌ కేసుని సీబీఐ డీల్‌ చేస్తున్న విషయం తెలిసిందే.