కరోనావైరస్ రోజు రోజుకీ  విజృంభిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో ఒక్క చోట జరిగే చిన్న పొరపాటుతో జనం కరోనావైరస్ బారినపడుతున్నారు.  కరోనా సోకకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్న వాళ్లు కూడా కొవిడ్-19 బారినపడుతుండటమే బాధాకరం. తాజాగా ప్రముఖ టీవీ నటుడు బిత్తిరి సత్తి కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వయంగా బిత్తిరి సత్తి తనకు కరోనా సోకిన విషయం వెల్లడించారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు.

 తనకు కరోనా ఎక్కడ సోకిందన్న విషయం కచ్చితంగా చెప్పలేనని, మీడియాలో పనిచేస్తున్నందున కొన్ని సందర్భాల్లో వివిధ ప్రదేశాలకు వెళ్లాల్సి రావడంతో కరోనా సోకినట్టు భావిస్తున్నానని తెలిపారు. మీడియాలో పనిచేసే కొందరు సహచరులకు కూడా కరోనా వచ్చిందని అన్నారు. రెండ్రోజుల క్రితం స్వల్పంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు రావడంతో టెస్టు చేయించుకున్నానని, ఆ టెస్టులో పాజిటివ్ అని వచ్చిందని సత్తి పేర్కొన్నారు.

వెంటనే అతని కుటుంబంతో పాటు ఇంట్లోనే క్వారంటైన్ అవుతున్నట్టు తెలుస్తోంది. కరోనా లక్షణాలు ఎక్కువగా లేనందున బిత్తిరి సత్తి ఇంట్లోనే ఉండి కరోనాను నయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయమై బిత్తిరి సత్తి మాట్లాడుతూ '' సరైన జాగ్రత్తలు తీసుకొని, మంచి పౌష్టికాహారం తీసుకోగలిగితే కరోనాని జయించొచ్చు'' అని అన్నారు.
 
ఇక టీవీ9ను వదిలేసి సాక్షి ఛానెల్ లో చేరిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ఇక్కడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన డిఫరెంట్ స్టయిల్, మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న బిత్తిరి సత్తి..   గరంగరం వార్తలు అనే కార్యక్రమంతో సాక్షిలో అలరిస్తున్నాడు.