అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి అభిమానుల గుండెల్ని చిదిమేసి అర్థాంతరంగా తనువు చాలించి.. అర్థంకాని చరిత్రగా మిగిలిపోయింది. లక్షలాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సాక్షిగా శ్రీదేవి భూలోకం విడిచి ఇంద్రలోకానికి తరలిపోయింది. బంధువుల ఇంట జరుగుతున్న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు దుబాయి వెళ్లిన శ్రీదేవి... అక్కడే తాను బస చేసిన హోటల్ బాత్ టబ్లో పడి చనిపోయింది. దుబాయి చట్టాల ప్రకారం పోస్టుమార్టం ఇతర ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని ఆమె భౌతిక కాయాన్ని ముంబై తీసుకువచ్చేందుకు ఏకంగా మూడు రోజుల సమయం పట్టింది. చాలా ఆలస్యంగా ముంబై చేరుకున్న శ్రీదేవి పార్ధివ దేహానికి నిన్న అభిమానులు అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల కన్నీటి సంద్రం మధ్య అంత్యక్రియలు ముగిశాయి. సరే.. శ్రీదేవి మరణ వార్త ఏ ఒక్కరూ జీర్ణించుకోలేనిదే. మరి ఇప్పుడు అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఈ విషయంపై ప్రస్తావన ఎందుకంటారా? తప్పనిసరిగా అవసరమేనని చెప్పాలి. ఎందుకంటే దుబాయి నుంచి శ్రీదేవి పార్ధివ దేహం ముంబై వచ్చేందుకు మూడు రోజుల సమయం పడితే... ఆ మూడు రోజుల పాటు మన మీడియా చేసిన హంగామా మామూలుగా చేయలేదు.అసలే కూతురు హీరోయిన్గా వస్తున్న తొలి చిత్రం గురించి శ్రీదేవి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీదేవి కడుపున పుట్టిన జాన్వీ కపూర్ నిజంగానే తల్లిని మరిపిస్తుందా? అన్న విషయంపై ఇప్పుడు  అంతా చర్చించుకుంటున్నారు.  సిల్వర్ స్క్రీన్పై తనను చూడకుండానే జరిగిన తల్లి మరణాన్ని జాన్వీ జీర్ణించుకునేందుకు చాలా సమయమే పడుతుంది. ఈ క్రమంలో మన మీడియా... లోకల్ తో పాటుగా జాతీయ మీడియా శ్రీదేవి మరణంపై చేసిన హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. బాత్ టబ్లో పడి చనిపోయిన శ్రీదేవి ఉదంతాన్ని చెప్పేందుకు తమదైన శైలిలో అతి చేసిన దాదాపుగా అన్ని ఛానెళ్లు తమదైన శైలి పైత్యం చూపాయి. ఓ యాంకరమ్మ బాత్ రూమ్నే న్యూస్ రూమ్గా చేసుకుంటే... మరో యాంకరయ్య బాత్ టబ్ను బిగ్ స్క్రీన్పై పెట్టేసి వార్తలు చదివేశారు.
ఈ క్రమంలో ప్రతి విషయాన్ని తనదైన శైలిలో  వీ6 చానెల్కు చెందిన బిత్తిరి సత్తి... శ్రీదేవి మరణంపై మీడియా చేసిన అతిని ఓ రేంజిలో కడిగిపారేశాడు. నిన్నటి ఎపిసోడ్లో భాగంగా తొట్టిల రిపోర్టింగ్  పేరిట ఎంట్రీ ఇచ్చిన బిత్తిరి సత్తి... మీడియా అతిపై తనదైన శైలి సెటైర్లు వేశారు. శ్రీదేవి మరణంపై ఆయా మీడియా ఛానెళ్లు చేసిన అతిపై కౌంటర్లు ఇస్తూనే... వాటి యాజమాన్యాలకు భారీ చురకలు వేశారు. అసలు ఈ తరహా రిపోర్టింగ్ను జనం ఏ రేంజిలో తిట్టుకుంటున్నారన్న విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టేసిన బిత్తిరి సత్తి.టబ్ లో పడుకుని వార్తలు చెబితేనే బాగుంటుందని సెటైర్ వేసిన సత్తి... సముద్రంలో మునిగి చనిపోయిన వారి వార్తలను నీటిలో మునుగుతూ తేలుతూ చెప్పాలని విషం తాగి మరణించిన వారి వార్తలను చెప్పేటప్పుడు యాంకర్లు కూడా విషం తాగే స్క్రీన్ పై ప్రత్యక్షం కావాలని కూడా ఓ రేంజిలో ఏసుకున్నాడు. మొత్తంగా మీడియా ఛానెళ్ల బిత్తిరి సత్తి తనదైన సెటైర్లతో దిమ్మతిరిగే దాడి చేశాడు.