విశ్వనటుడు కమల్ హాసన్ నేడు పుట్టినరోజు జరుపుకున్నారు. గొప్ప నటుడిగా దేశవ్యాప్తంగా ఇమేజ్ కలిగిన కమల్ హాసన్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక కమల్ తన కొత్త చిత్ర ప్రకటన చేయడంతో పాటు కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ అనే టైటిల్ నిర్ణయించారు. కమల్ మాఫియా డాన్ రోల్ చేస్తున్నారని నేటి వీడియో చూస్తే అర్థం అవుతుంది. 

కాగా కమల్ హాసన్ తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులతో మాట్లాడాడు. కమల్ బర్త్ డే సంధర్భంగా నాగార్జున కమల్ ని కలిసే ఏర్పాటు చేశారు. ఇక కింగ్ నాగార్జున కమల్ హాసన్ కి బర్త్ డే విషెష్ చెప్పడంతో పాటు, ఇంటి సబ్యులను పరిచయం చేశారు. బిగ్ బాస్ ఇంటి సభ్యులు కమల్ ని కలవడం ఎంతో ఎక్సయిట్మెంట్ గా ఫీలయ్యారు. అలాగే ఆయనకు బర్త్ డే విషెష్ చెప్పడం జరిగింది. అదే విధానంగా కమల్ హాసన్ తమిళ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని పరిచయం చేశారు. నాగార్జున మీ హౌస్ ఫుల్ గా ఉందని చెప్పగా, ఆ మాట మనందరికీ నచ్చేదని కమల్ చమత్కరించారు. 

ఇక ఎలిమినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో ఒకరిని సేవ్ చేయాలని కమల్ ని నాగార్జున కోరారు. ఇక నాగార్జున చేతిలో ఉన్న కవర్ లో ఉన్న ఇంగ్లీష్ లో రాసిన పేరు కమల్ కి చూపించారు. టెన్ కౌంట్ తరువాత కమల్ హాసన్ ఆ హారిక పేరు చెప్పి ఆమెను సేవ్ చేశాడు . కమల్ లాంటి నటుడు తనను సేవ్ చేయడంతో ఎంతో ఆనందం అని హారిక ఎగిరి గంతేసింది. మా కుటుంబ సభ్యులు దీనికి ఎంతో సంతోషిస్తారని ఆమె బిగ్ బాస్ కి  థాంక్స్  చెప్పింది. చేసింది నేనైతే...బిగ్ బాస్ కి థాంక్స్ చెవుతావా అని హరికపై సెటైర్ వేశారు నాగార్జున.