మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితంపై బయోపిక్

First Published 2, Jan 2018, 2:31 PM IST
biopic on andhra pradesh dynamic leader ys rajasekhar reddy
Highlights
  • తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి
  • మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితంపై బయోపిక్
  • ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి రాఘవ దర్శకత్వం
  • మమ్ముట్టి హీరోగా వై.ఎస్.ఆర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్స్

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేతల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఆయన అకాల మరణం యావన్మంది తెలుగు ప్రజలను దుఃఖ సాగరంలో ముంచెత్తింది. ప్రజలకు మరవలేని మేలు చేసి కలకాలం గుర్తిండిపోయేలా నిలిచిన రాజకీయ నేతల్లో వైఎస్ఆర్ పేరు ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా వున్నప్పుడు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేత అనిపించుకున్నారు.

 

మహానేతగా గుర్తింపు పొందిన వై.ఎస్.ఆర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనే యోచనతో గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా.. రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో బయోపిక్స్ ట్రెండ్ బాగానే నడుస్తోంది. ఆంధ్రుల అన్న ఎన్టీఆర్ జీవితంపై నందమూరి బాలకృష్ణ, రామ్ గోపాల్ వర్మ తో పాటు మరి కొందరు సినిమా తెరకెక్కిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

ఇప్పుడు మహానేత వై.ఎస్.ఆర్ జీవితాన్ని కూడా వెండితెరపై ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల ఆనందో బ్రహ్మ చిత్రంతో సక్సెస్ సాధించిన దర్శకుడు మహి రాఘవ.. వై.ఎస్.ఆర్ జీవిత కథ ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. అంతేకాక ప్రస్తుతం నటీనటుల ఎంపిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం... మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రను చేయించాలని చూస్తున్నాడట దర్శకుడు మహి రాఘవ. ఇప్పటికే ప్రపోజల్ ను పంపారని.. మమ్ముట్టి నుంచి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారని టాక్. మరోవైపు ఈ చిత్రాన్ని తెరకెక్కించే అంశంపై అనుమతుల కోసం వై.ఎస్.ఆర్ తనయుడు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కూడా కలిసేందుకు మహి రాఘవ ప్రయత్నిస్తున్నాడట. అన్నీ కుదిరితే మరో క్రేజీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైనట్లే.

loader