బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ అభిజిత్‌ తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే ఆయన బిగ్‌బాస్‌ 4 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మొక్కలు నాటి తన బాధ్యతని చాటుకున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా అభిజిత్‌ మాట్లాడుతూ, `బిగ్‌బాస్‌4 విన్నర్‌గా నిలిచిన తర్వాత ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి ఈ రోజు మొక్కలు నాటాను. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఆయన ధన్యవాదాలు. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని మనందరం నియంత్రించడం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి` అని అన్నారు. 

ఈ సందర్భంగా అభిజిత్‌.. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న సోహైల్‌, హారిక, కళ్యాణిలను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సీ శ్రీనివాస్‌రెడ్డి, రాఘవ, కిషోర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.