చిత్ర పరిశ్రమలో పాపులారిటీ కోసం, సెన్సేషన్‌ కోసం వివాదాలు సృష్టించడం కామన్‌. ఆ హీరో నన్ను తొక్కేశాడని, వాళ్ళు తనని వేధిస్తున్నారని చెబుతుంటారు. ఇప్పుడిప్పుడే వస్తోన్న కొందరు హీరోయిన్లుగానీ, నటులుగానీ అవకాశాల కోసం ఇలాంటి సంచలనాలకు తెరలేపుతుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదని చెప్పలేం.. అలాగని అన్నీ వాస్తవాలనీ చెప్పలేం. 

తాజాగా లోకనాయకుడు కమల్‌ హాసన్‌, నటి మీరా మిథున్‌ విషయంలో ఇదే జరుగుతుంది. `బిగ్‌బాస్‌4` విషయంలో ఈ వివాదం రాచుకోవడం విశేషం. ఇందులో మీరా మిథున్‌.. కమల్‌కి వార్నింగ్‌ ఇచ్చింది. ఈ `బిగ్‌బాస్‌ 4` షోని అడ్డుకుంటానని, అందుకోసం కోర్ట్ కి వెళ్తానని బెదిరింపులకు దిగింది. మరి అందుకు దారి తీసిన కారణాలేంటనేది ఓ సారి చూస్తే, 

మీరా మిథున్‌ తమిళ `బిగ్‌బాస్‌3` సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ షోలో పాల్గొన్న మరో కంటెస్టెంట్‌, దర్శకుడు చేరన్‌ తన నడుమును గట్టిగా పట్టుకుని లాగాడంటూ ఆరోపించింది. కానీ అందులో నిజం లేదని మరుసటి వారం కమల్‌ ఓ వీడియోని ప్రదర్శించారు. దీంతో మీరా షాక్‌కి గురయ్యింది. ఆమె కావాలని వివాదం సృష్టిస్తుందనే విషయం తేలిపోయింది. 

అంతటితో ఆగలేదు, స్టార్‌ హీరోయిన్‌ త్రిషపై కామెంట్‌ చేసింది. ఆమె తన మేకప్‌ విధానాన్ని కాపీ కొడుతుందంటూ ఆరోపించింది. దీంతోపాటు విజయ్‌, సూర్య ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా పలు కామెంట్లు చేసి వివాదాస్పద నటిగా మారింది. తాజాగా మరో సెన్సేషన్‌కి తెరలేపింది. `బిగ్‌బాస్‌ 4`ని అడ్డుకుంటానని బెదిరించింది. తనకు సంబంధించిన ఓ వీడియోని దాచి తనని నటనకు దూరం చేయాలని కమల్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. 

`బిగ్‌బాస్‌3` సీజన్‌లో తనకు వ్యతిరేకంగా ఆయన తీర్చు ఇచ్చారని, `బిగ్‌బాస్‌ 4`ని కూడా సరిగా నిర్వహించడం లేదని ఆరోపించింది. దాచిన తన వీడియోని అప్పగించేంత వరకు `బిగ్‌బాస్‌4` షో షూటింగ్‌ని సరిగా జరగకుండా అడ్డుకుంటానని, అందుకోసం కోర్టుకెళ్ళి స్టే తెస్తానని తాను పంచుకున్న వీడియోలో మీరా హెచ్చరించింది. మరి మీరా వ్యాఖ్యలపై `బిగ్‌బాస్‌ 4` టీమ్‌గానీ, కమల్‌గానీ ఎలా స్పందిస్తారో చూడాలి. తమిళ `బిగ్‌బాస్‌ 4`కి కమల్‌ హాసన్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.