కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున బిగ్ బాస్ సీజన్ 3 ఆసక్తికరంగా కొనసాగుతోంది. తొలివారం కూడా పూర్తి కాకముందే ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. హౌస్ లో ఎవ్వరూ తగ్గడం లేదు. ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తొలి మూడు రోజులు సైలెంట్ గా ఉన్న పునర్నవి నాల్గవ ఎపిసోడ్ లో రేసులోకి వచ్చింది. 

ఇదిలా ఉండగా ఎపిసోడ్ లో ఫుడ్ విషయంలో జరిగిన ఓ గొడవ హాట్ టాపిక్ గా మారింది. హేమ, సింగర్ రాహుల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అలీ రెజా కూడా హేమని టార్గెట్ చెసాడు. ఈ గొడవకు ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సి వస్తే అది శ్రీముఖినే. ఇప్పటికే హేమ, శ్రీముఖి ఎక్కువగా కిచెన్ లో గడుపుతున్నారు. కిచెన్ ని తన ఆధిపత్యంలో తీసుకోవాలనుకుందో ఏమో కానీ ఇంటి సభ్యుల మధ్య ఫుడ్ పంచాయతీ పెట్టింది. 

కిచెన్ లో ఇక వంట సరుకులు ఎన్ని రోజులకు సరిపడా ఉన్నాయి అనే విషయాన్ని శ్రీముఖి.. రాహుల్, అలీ రెజా వద్ద ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ కొన్ని సూచనలు చేశారు. పక్కనే బిజీగా ఉన్న హేమ వీరి సంభాషణని వింటోంది. మొదటి నుంచి హేమనే ఇంటి సభ్యులకు వండి పెడుతోంది. 

వంట విషయంలో మీరేం మాకు డైరెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని హేమ అనగా క్రమంగా వివాదం పెరిగింది. అసలు వీళ్ళ దగ్గర ఎందుకు డిస్కషన్ చేస్తున్నావు అని హేమ.. శ్రీముఖితో అంది. ఆ మాటకు రాహుల్, అలీ రెజా ఇద్దరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాహుల్ మరింతగా రెచ్చిపోయాడు. 

అక్కా అని పిలుస్తూనే హేమపై విరుచుకుపడ్డాడు. మేము కూడా ఇంటి సభ్యలమే. కాబట్టే శ్రీముఖి మాతో ఫుడ్ గురించి మాట్లాడుతోంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ ఇక్కడ జరిగే అన్ని విషయాల గురించి మాట్లాడే హక్కు ఉంది అని రాహుల్ తెలిపాడు. హేమ, రాహుల్ మధ్య మాటామాటా పెరిగి గట్టిగా కేకలు వేసుకున్నారు. అలీ రెజా కూడా హేమ వ్యాఖ్యలని తప్పుబట్టాడు. మిగిలిన వాళ్లంతా ఈ గొడవని అలా చూస్తూ ఉండిపోయారు.