బిగ్ బాస్ షోలో మంగళవారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లతో హౌస్ రణరంగంగా మారింది. ఈవారం నామినేట్ అయిన ఆరుగురు సభ్యులు రాహుల్, రవికృష్ణ, వరుణ్ సందేశ్, మహేష్ విట్టా, పునర్నవి, హిమజలను యాక్టివిటీ ఏరియాలోకి రావాలని బిగ్ బాస్ కోరారు. ఈ ఆరుగురిలో ముగ్గురికి ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్లకుండా ఒక డీల్ ఇచ్చారు.

ఆరుగురిలో సేఫ్ కావాల్సిన ముగ్గురు ఎవరో మీలో మీరే చర్చించుకుని తేల్చుకోమని చెప్పడంతో.. ఫైనల్ గా రవి, రాహుల్, వరుణ్ లు బిగ్ బాస్ తో డీల్ కి సిద్ధమయ్యారు. డీల్ లో భాగంగా వీరు కొన్ని టాస్క్ లు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వరుణ్, వితికాల మధ్య గొడవ జరిగింది. టాస్క్ లో భాగంగా రాహుల్.. వితికాతో రూడ్ గా ప్రవర్తించడం ఆమెకి నచ్చలేదు. దీంతో ఆమె బాధపడింది.

ఛాలెంజ్ ని ఎదుర్కొనే సమయంలో వరుణ్ ఏమీ చేయలేని పరిస్థితి. అయినప్పటికీ తన భార్య దగ్గరకి వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ వితికా 'నా గురించి నీకెందుకు.. నీ టాస్క్ లు నువ్ చేస్కో' అంటూ అరిచింది. దీంతో వరుణ్.. 'ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావ్.. గేమ్ ను స్పోర్టివ్ గా తీసుకోవడం నేర్చుకో.. ఇక్కడికొచ్చిన తరువాత నన్ను ముట్టుకోవద్దు అంటే కుదరదు' అంటూ భార్యతో గొడవ పడ్డాడు.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా వరుణ్.. ఒకరిపై చల్లి కాఫీ విసరాలి.. అది తన భార్యపైనే ప్రయోగించాడు. అలానే హౌస్ లో ఎవరైనా ఒకరికి ఇష్టమైన బట్టలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి.. దానికోసం కూడా తన భార్య బట్టలనే ఎంపిక చేసుకున్నాడు. ఈ సమయంలో వరుణ్ ను బాబా భాస్కర్ అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వరుణ్ ఆగలేదు. కోపంతో ఊగిపోయిన వితికా.. అన్ని బట్టలు కత్తిరించేసుకో అంటూ తన బట్టలు బయటపడేసింది.