నిన్నటి నుండి బిగ్ బాస్ హౌస్ లో ట్రాన్స్ జెండర్ తమన్నా హద్దులు మీరి ప్రవర్తిస్తోంది. తనను నామినేట్ చేశాడనే కారణంతో రవిక్రిష్ణను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. సోమవారం నాటి ఎపిసోడ్ లో రవిని వ్యక్తిగతంగా దూషించిన తమన్నా మంగళవారం నాడు కూడా అదే కంటిన్యూ చేసింది. తను బిగ్ బాస్ హౌస్ లో ఉండేది మరో ఐదు రోజులు మాత్రమేనని ఈ ఐదు రోజులు మాత్రం తన శత్రువు రవిక్రిష్ణను మాత్రం వదిలిపెట్టను అంటూ పర్సనల్ అటాక్ చేసింది తమన్నా. 

మొదట జర్నలిజం కూడా యాక్టింగ్ అని డబ్బు కోసం చేస్తుంటారని శివజ్యోతిని ఉద్దేశిస్తూ మాట్లాడింది తమన్నా. దీంతో శివజ్యోతి ఓ రేంజ్ లో తమన్నాపై ఫైర్ అయింది. నోటికొచ్చి మాట్లాడితే ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. 

డైనింగ్ టేబుల్ మీద సైలెంట్ గా కూర్చొని టిఫిన్ చేస్తోన్న రవిని ఇష్టమొచ్చినట్లు దూషించింది తమన్నా. నవ్వులో కూడా దమ్ములేదని.. నువ్ మగాడికి కాదు.. రేయ్ పప్పూ అంటూ అతడిని రెచ్చగొట్టింది. తమన్నా ఎంత రెచ్చగొట్టినా రవికృష్ణ స్పందించక పోవడంతో వీడు మగాడే కాదంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. రవికృష్ణ తనకు ఎంత కోపం వస్తున్నా.. కంట్రోల్ చేసుకొని కామ్ గా ఉన్నాడు. 

రవిని తమన్నా అలా టార్గెట్ చేయడాన్ని హౌస్ మేట్స్ కూడా భరించలేకపోయారు. అతడికి అండగా నిలిచారు. ట్రాన్స్ జెండర్స్ తరపున వచ్చి వాళ్లకు స్పూర్తిగా నిలవాల్సిన మీరు ఇలా దిగజారుడుగా ప్రవర్తించడం సరికాదంటూ తమన్నా మొహం మీదే అన్నాడు రాహుల్. దీంతో అతడితో కూడా గొడవకి దిగింది తమన్నా. హౌస్ మొత్తం కూడా తమన్నా చేష్టలతో విసిగిపోయింది.