బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి ఎంటర్ అయింది యాంకర్ శిల్పా చక్రవర్తి. ఇక మంగళవారం ఎపిసోడ్ లో తన గేమ్ ని మొదలుపెట్టింది శిల్పా. హౌస్ లో తన మొదటిరోజు కాబట్టి అన్నీ గమనిస్తున్నానని రేపటి నుండి విజృంభిస్తా అంటూ సవాల్ చేసింది.

ఒక్కరోజు కాకపోతే వారంరోజులు గమనించు.. వారంలోనే వెళ్లిపోవచ్చు కూడా అంటూ పంచ్ వేశారు బాబా భాస్కర్. ఆ మాట తనకు నచ్చలేదని బాబాకి మొహం మీదే చెప్పింది శిల్పా. ఇక శిల్పాకి శ్రీముఖికి పడదని.. వారిద్దరికీ ఏవో పాత ప్రాబ్లమ్స్ ఉన్నాయని రాహుల్ తో గుసగుసలాడింది పునర్నవి.

ఈ వారం టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్‌కు దొంగలు దోచిన నగరం అనే టాస్క్ ఇచ్చారు. దొంగలు ముఠా, నగర వాసులు అని కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టి గేమ్ ఆడించారు. దొంగలకు రాణిగా శిల్పాను పెట్టారు. గేమ్ మొదలైన తరువాత టాస్క్ మొత్తం హింసాత్మకంగా మారిపోయింది.

ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ రచ్చ చేశారు. దీంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ లివింగ్ ఏరియాలోకి పిలిచి హౌస్‌లో హింసకు తావులేదని చెప్పారు. అయినప్పటికీ టాస్క్ అలా డిజైన్ చేయడంతో హౌస్ మేట్స్ తన్నుకోక తప్పలేదు. ఇక ఈ టాస్క్ రేపటి ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవ్వనుంది.