ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న ఉత్కంఠతో షో సాగింది. ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. ‘మన’ టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌ ముచ్చట్లను చూపించారు. ప్రస్తుతం హౌస్‌లో టాప్ కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై పునర్నవి ఓ స్టోరీ చెప్పింది. రాహుల్, శ్రీముఖి బయట ఫ్రెండ్స్ అని.. వీళ్లు బయట డీల్ మాట్లాడుకుని హౌస్‌లో ఇలా ఉండాలని ఆ ప్లాన్‌ని వర్కౌట్ చేస్తున్నారని మాట్లాడింది.

సమయం వచ్చినప్పుడు బయటపడతారని.. ఆస్కార్ నామినీ  పెర్ఫామెన్స్ ఇస్తున్నారని.. వీళ్లు గొడవలు పడటం అంతా డ్రామా, వీళ్ల ప్లాన్‌లో ఇద్దరూ బాగా ఇన్వాల్వ్ అయ్యారని ఏదేదో స్టోరీ చెప్పింది. ఇది విన్న రాహుల్ ఈమె సైకాలజీ చదివి ఏం పీకిందో నాకు ఇప్పుడు అర్ధమైందని గాలి తీసేశాడు. ఇక హౌస్ మేట్స్ తో మాట్లాడిన నాగార్జున ఈ వారంతో వారేం చేశారో గుర్తు చేస్తూ వారి తప్పులను కరెక్ట్ చేశారు.

ఇక హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంలో ఎలాంటి ల్యాగ్ లేకుండా రాహుల్ పేరు చెప్పారు నాగార్జున. హిమజ ఎలిమినేట్ అవుతుందని భావించిన హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ అందరికీ రాహుల్ ని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. రాహుల్ ని స్టేజ్ మీదకి పిలిచిన నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడించారు. 

వారికి గుడ్ బై చెప్పిన తరువాత నాగార్జున.. రాహుల్ తో ఇది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి షాక్ ఇచ్చాడు. వెంటనే రాహుల్ ఆనందంలో నాగ్ ని హగ్ చేసుకున్నాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి రేపటి ఎపిసోడ్ లో హిమజ, మహేశ్ లు ఎలిమినేట్ కానున్నారు.