బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం నాటితో ఏడు వారాలను పూర్తి చేసుకోనుంది. తాజాగా ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. ప్రోమోలో నాని కనిపించి షాక్ ఇచ్చారు. సీజన్ 3కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే నేటి ఎపిసోడ్ లో నాని ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నాని హీరోగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ 'గ్యాంగ్ లీడర్' సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది.

ఇందులో భాగంగా నాని బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించబోతున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే.. బిగ్ బాస్ సీజన్ 2కి నాని హోస్ట్ గా వ్యవహరించిన సమయంలో నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా రిలీజైంది. ఆ సమయంలో ప్రమోషన్స్ కోసం నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పుడు నాగార్జున షోని హోస్ట్ చేస్తుంటే నాని గెస్ట్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక షో విషయనికొస్తే.. ఈరోజు ఎపిసోడ్ లో శ్రీముఖి, మహేష్, రవి, అలీ రెజాలలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. సోషల్ మీడియాలో అలీ ఎలిమినేట్ కాబోతున్నాడంటూ ప్రచారం  జరుగుతోంది.