నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ కి రెడీ అవుతోంది. అయితే రెండో సీజన్ కి నెగెటివిటీ బాగా రావడంతో ఈ షోని హోస్ట్ చేయడానికి మన స్టార్లు వెనుకడుగు వేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 2 కారణంగా హోస్ట్ నాని సోషల్ మీడియా వేదికగా చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3ని హోస్ట్ చేయాలనే ఆసక్తి మన హీరోల్లో కనిపించడం లేదు. సీజన్ 1 హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ని మూడో సీజన్ హోస్ట్ చేయాలని కోరగా.. ఆయన తన బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ ఆఫర్ తిరస్కరించాడు.

దీంతో షో నిర్వాహకులు అక్కినేని నాగార్జునని సంప్రదించారు. గతంలో నాగ్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోని విజయవంతంగా నడిపించారు. అయితే నాగార్జున మాత్రం బిగ్ బాస్ షో హోస్ట్ చేయాలనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. దీంతో మేకర్స్ మరో ఇద్దరి హీరోలను కూడా సంప్రదించాలని చూస్తున్నారు. 

వారెవరంటే విక్టరీ వెంకటేష్. రానా. వరుసకి బాబాయ్, అబ్బాయ్ లైన వీరిలో ఏ ఒక్కరు ఓకే చెప్పినా.. షో వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.  రానా ఇప్పటికే బుల్లితెరపై కొన్ని షోలు చేశాడు. కాబట్టి ఆయనకి బిగ్ బాస్ హోస్టింగ్ పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే వెంకీ గనుక హోస్ట్ గా వస్తే షోకి కొత్తదనం వస్తుంది. ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి!