గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో టాలెంట్ షో జరుగుతోంది. ఈ షోకు బాబా భాస్కర్‌, శ్రీముఖి జడ్జెస్‌గా వ్యవహరించారు. హౌస్ మేట్స్ అంతా ఈ షోలో తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. వీరందరిలో నలుగురిని ఎంపిక చేసి రెండో రౌండ్ కి పంపించారు. అలీ రెజా, మహేష్ విట్ట, రవికృష్ణ, వరుణ్ సందేశ్‌లను రెండో రౌండ్‌కు ఎంపిక చేయగా.. అలీ 
తన స్కిట్ తో వీర లెవెల్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మిగిలిన వారు కూడా తమదైన శైలిలో ఆకట్టుకున్నారు.

ఈ నాలుగు పెర్ఫార్మెన్సులు చూసిన జడ్జెస్.. అలీ, రవిలను వేదికపైకి పిలిచారు. వీళ్లిద్దరిలో ఎవరు విజేతో చెప్పాలని ఇంటి సభ్యులకే అవకాశం ఇచ్చారు. ఏడుగురు అలీకి ఓటేయగా.. ముగ్గురు రవి వైపు నిలబడ్డారు. దీంతో అలీని విజేతగా ప్రకటించారు. ఆ తరువాత హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఇంటి సభ్యులపై తమకున్న ఫిర్యాదులను కంప్లైంట్ బాక్సులోవేశారు.

ఇంటి సభ్యుల్లో ఎవరిపైనైనా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదులను సేకరించి ఇంటి కెప్టెన్ అందరి ముందు చదివి వినిపించి పరిష్కరించాలి. కెప్టెన్ శివజ్యోతి ముందుగా మహేష్ పై వచ్చిన కంప్లైంట్ చదివింది. మహేష్ తనకు అవసరం లేని విషయాల్లో దూరి అనవసరమైన సలహాలు ఇచ్చి సమస్య మరింత పెద్దది చేస్తున్నాడని శివజ్యోతి చదివి వినిపించింది.

అయితే ఈ కంప్లైంట్ ఎవరు రాశారో తెలియలేదు. ఆ తరువాత మరో కంప్లైంట్ కూడా మహేష్ పైనే వచ్చింది. అది రాసింది తనేనని పునర్నవి ముందుకొచ్చి మాట్లాడింది. ఆమె మాటలకు మహేష్ కాస్త హర్ట్ అయినట్లే కనిపించాడు. ఆ తరువాత అలీపై వచ్చిన ఫిర్యాదు చదివింది శివజ్యోతి. ''హౌస్‌మేట్స్‌ని తక్కువ చేసి మాట్లాడటం.. ఎదుటి మనిషికి మర్యాద ఇవ్వకపోవడం.. హీరో అవ్వడానికి బిగ్ బాస్ నియమాలు తప్పడం'' ఇది అలీపై మహేష్ రాసిన ఫిర్యాదు.

వీటికి సమాధానం ఇచ్చే క్రమంలో అలీ, మహేష్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ కంట్రోల్ తప్పారు. ‘‘ఫస్ట్ ఎవడ్రా అరిచింది.. ఇదేమైనా నీ ఇల్లనుకున్నావేంట్రా. వాడేమంటే అది నేను పడాలా?’’ అంటూ మహేష్ ఆవేశపడ్డాడు. దీంతో అలీ.. ‘‘అవును ఇది నా ఇల్లే అనుకున్నా’’ అంటూ వెటకారంగా సమాధానమిచ్చాడు. ఇప్పట్లో వీరిమధ్య గొడవలు సద్దుమణిగేలా కనిపించడం లేదు!