తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. డీవీవీ దానయ్య దీన్ని దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటి అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలీవియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. 

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` సినిమా షూటింగ్‌ని అక్టోబర్‌లో తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటికే సినిమాలోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్రలను పరిచయం చేశారు. ఈ మేరకు రెండు టీజర్‌ తరహా వీడియోలను విడుదల చేశారు. అవి ఆడియెన్స్ ని, ఇద్దరు హీరోల అభిమానులను మెప్పించడంతోపాటు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. 

ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది చిత్ర బృందం. అయితే సంక్రాంతికి `ఆర్‌ ఆర్‌ ఆర్‌` నుంచి ట్రీట్‌ ఏమీ ఉండబోదట. కానీ రిపబ్లిక్‌ డే సందర్భంగా భారీ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని రాజమౌళి టీమ్‌ భావిస్తుందట. సినిమాకి చెందిన ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇందులో ఇద్దరు హీరోలు కనిపించనున్నట్టు తెలుస్తుంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి ఉండేలా స్పెషల్‌ వీడియోని కట్‌ చేస్తున్నారట. 

ఇంకా `ఆర్‌ ఆర్‌ ఆర్‌` అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసే అంశమేంటంటే? చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ చెప్పబోతున్నారట. చిరు వాయిస్‌ ఓవర్‌తో ఈ వీడియోని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అలాగే హిందీలో అమిర్‌ ఖాన్‌ వాయిస్‌తో వీడియోని రిలీజ్‌ చేయబోతున్నారని, ఇతర భాషలకు చెందిన బిగ్‌ స్టార్‌ ఒకరు వాయిస్‌ ఓవర్‌ చెప్పబోతున్నట్టు టాక్‌. కేవలం వీడియోలకే కాదు, సినిమాలో కూడా ఈ బిగ్‌ స్టార్స్ వాయిస్‌ ఓవర్‌ ఉంటుందని తెలుస్తుంది. ఇది పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న విషయం తెలిసిందే.