మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర తెరకెక్కుతోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. భారీ బడ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ సినిమాను దేశ వ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హిందీలో కూడా భారీ ఎత్తున సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఆ స్థాయికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మాత్రం చేయలేకపోతున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఒక్క సరైన పోస్టర్ కానీ ఫస్ట్ లుక్ కానీ బయటకి రాలేదు.

సినిమాలో చాలా మంది ఫేమస్ సెలబ్రిటీలు ఉన్నారు. వారి ఫోటోలు రిలీజ్ చేసినప్పటికీ సరైన బజ్ మాత్రం క్రియేట్ అవ్వలేదు. ఒకరకంగా ఇప్పటివరకు 'సైరా'కి సరైన పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలుపెట్టలేదు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానున్ననేపధ్యంలో ఇప్పుడు చిరు స్వయంగా పబ్లిసిటీ విషయంలో రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ సినిమాను హిందీతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. 

తెలుగులో పబ్లిసిటీ కార్యక్రమాలు షురూ చేసి బాలీవుడ్ లో మాత్రం విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. అక్కడ అమితాబ్ బచ్చన్ ని వాడుకోవాలనేది ప్లాన్. ఈ సినిమాలో అమితాబ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయన పాత్ర నిడివి కూడా ఎక్కువే.. అందుకే బిగ్ బీ యాంగిల్ లో సినిమాను బాలీవుడ్ లో ప్రమోట్ చేయబోతున్నారు.

దాదాపు ఇది అమితాబ్ సినిమా అన్నట్లు టీజర్లు, ట్రైలర్లు వదలాలని ప్లాన్. దానికోసం స్పెషల్ గా ఓ ప్రమోషన్స్ టీమ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. బాలీవుడ్ కి ఒక టీమ్, తెలుగుకి మరో టీమ్, మిగిలిన భాషలను మరో టీమ్ పని చేయబోతుంది. రామ్ చరణ్, ఉపాసనలు వీటిని కోఆర్డినేట్ చేయబోతున్నారు. బాలీవుడ్‌లో ‘సైరా’ కి సంబంధించిన ఈవెంట్ ఒక‌టి భారీగా నిర్వ‌హించాల‌ని అనుకుంటున్నారు. ఆ వేడుక‌కు స‌ల్మాన్‌, సంజ‌య్ ద‌త్ ల‌ను తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.