`ఢీ` షో జడ్జ్, నటి పూర్ణ భర్త షానిద్‌ అసిఫ్‌ అలీ పేరుతో మోసం జరుగుతుందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై పూర్ణ స్పందించింది. 

హీరోయిన్‌ పూర్ణ `ఢీ` షో జడ్జ్ గా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఇటీవల దుబాయ్‌ బేస్డ్ వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని వివాహం చేసుకుంది. ఆయన తమ కంపెనీ ద్వారా ఇండియన్స్ కి గోల్డెన్‌ వీసాలను అందిస్తుంటారు. అయితే ఆయన పేరుతో సైబర్‌ నేరాలు జరుగుతున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్‌ నేరగాళ్లు మామూలు వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు తమ నేరాలకు పావులుగా వాడుకుంటున్నారు. 

తాజాగా పూర్ణ భర్త షానిద్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌ ప్రొఫైల్‌లో షానిద్‌ ఫోటోని పెట్టి సామాన్యుల నుంచి డబ్బులను లాగుతున్నారు. ఈ విషయం తాజాగా పూర్ణ వద్దకు చేరింది. తన భర్త షానిద్‌ ఫోటోని వాట్సాప్‌ డీపీగా క్రియేట్‌ చేసిన ఓ నెంబర్‌ నుంచి లావాదేవీలు జరుపుతున్నారనే విషయం పూర్ణ దృష్టికి వచ్చింది. నెటిజన్లు కొందరు ఆమె దష్టికి తీసుకురాగా పూర్ణ స్పందించింది. 

అది తన నెంబర్‌ కాదని స్పష్టం చేసింది. తన భర్త ఫోటోని చూపి మోసంచేస్తున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అంతేకాదు ఒకవేళ ఎవరైనా మోసపోతే అందుకు తన భర్త కారణం కాదని ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా వెల్లడించింది పూర్ణ. పూర్ణ ఇటీవల తన భర్తతో కలిసి హీరో విక్రమ్‌ కి గోల్డెన్‌ వీసా అందించిన విషయం తెలిసిందే. యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ప్రభుత్వానికి సంబంధించిన గోల్డెన్‌ వీసాలను సెలబ్రిటీలకు అందించడంలో షానిద్‌ సంస్థ పనిచేస్తుంటుంది. 

మరోవైపు పూర్ణ, షానిద్‌ ఇటీవలే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలోనే తమ వివాహం జరిగింది. తాజాగా ఈ విషయాన్నిపూర్ణ వెల్లడించారు. జూన్‌ 12న తమ వివాహం జరిగిందని తెలిపింది. ప్రస్తుతం పూర్ణ `ఢీ` డాన్సు షోకి జడ్జ్ గా చేస్తూనే, సినిమాల్లోనూ నటిస్తుంది. మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుండటం విశేషం.