భీమ్లా నాయక్ (bheemla nayak)రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకుంది. నైజాంలో పవన కళ్యాణ్ ఆల్ టైం రికార్డు నమోదు చేశారు.మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 26 కోట్లకు పైగా షేర్ భీమ్లా నాయక్ రాబట్టింది. మరి ఇంత పెద్ద విజయంలో కీలక పాత్ర ఎవరిది. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది ఇక్కడ అసలు సమస్య.
భీమ్లా నాయక్ మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ కి తెలుగు రిమేక్ అన్న విషయం తెలిసిందే. రిమేక్ అంటే దాదాపు ఒరిజినల్ కి దగ్గరగా తెరకెక్కిస్తారు. ఊళ్లు, పేర్లు వంటివి మార్చినా నేపథ్యం, కథ మార్చడానికి అసలు ఇష్టపడరు. అలా చేస్తే అసలుకే మోసం వస్తుంది. కథ అడ్డం తిరిగి అట్టర్ ప్లాప్ అయ్యే ప్రమాదం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీనికి మినహాయింపు. ఆయన రీమేక్ చేస్తే ఒరిజినల్ కి పెద్దగా సంబంధం ఉండదు. ఈ ప్రయోగాలు కొన్ని సార్లు ఫలిస్తే కొన్నిసార్లు ఘోరంగా దెబ్బతిన్నాయి.
భీమ్లా నాయక్ ప్రాజెక్ట్ లో పవన్ మిత్రుడు త్రివిక్రమ్ జాయిన్ అయ్యారు. స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చారు. నిజానికి త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా ఏలు పెట్టాడు. సాగర్ కే చంద్ర కొత్త దర్శకుడు. ఒకటి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన సాగర్ కే చంద్ర అంటే ప్రాజెక్ట్ లో నిర్మాతలకు పెద్దగా గౌరవం లేదు. సాగర్ కే చంద్రను అలా తెర ముందు పెట్టి పనికానిచ్చారు.
పవన్ ప్రాణ మిత్రుడైన త్రివిక్రమ్ అసలు లక్ష్యం సినిమాలో ఆయన్ని గొప్పగా కలియుగ శ్రీరామ చంద్రుడిగా చూపించాలి. ఈ ఆలోచనతోనే టైటిల్ పవన్ రోల్ నేమ్ అయిన భీమ్లా నాయక్ గా నిర్ణయించారు. నిజానికి ఒరిజినల్ మూవీలో కథ, పాత్రలు మాత్రమే ఉంటాయి. ఎక్కడా హీరోయిజం ఛాయలు కనిపించవు. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరో కావడంతో అయన పాత్రకు అనవసరమైన కొత్త హంగులు జోడించారు. రానా పాత్రను తొక్కేయాలని చూశారు. అయితే రానా తన అద్భుత నటనతో ప్రేక్షకుల మనసు దోచేశాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తనకెదురు లేదనిపించుకున్నాడు
భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమా పట్ల ఒక అంచనాకి వచ్చారు. రానా దగ్గుబాటి తన రోల్ తో పవన్ ని కూడా డామినేట్ చేయడం ఖాయం అన్నారు. వాస్తవంలో అదే జరిగింది. పవన్ పాత్రకు మించిన రెస్పాన్స్ రానా పాత్రకు వస్తుంది. రానా డానియెల్ శేఖర్ పాత్ర సినిమాకు హైలెట్ అన్న మాట వినిపిస్తుంది. మిత్రుడు పవన్ ని ఎలివేట్ చేసే క్రమంలో రానా పాత్ర అనుకోకుండా ఎలివేట్ అయ్యింది. రానా తన నటనతో పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లారు. దీనితో రానా ముందు పవన్ తేలిపోయాడన్న మాట వినిపిస్తుంది.
