భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న భీమ్లా నాయక్ (Bheemla Nayak)సక్సెస్ ఫుల్ రన్ థియేటర్స్ లో కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ హిందీ వర్షన్ సిద్ధం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)- రానా కాంబినేషన్ లో తెరకెక్కింది భీమ్లా నాయక్. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ కి అధికారిక రీమేక్. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించగా, త్రివిక్రమ్ స్క్రీన్, స్టోరీ సమకూర్చారు. ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున భీమ్లా నాయక్ విడుదలైంది. మొదటి షో నుండే భీమ్లా నాయక్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రికార్డు ఓపెనింగ్స్ దక్కాయి.
కాగా భీమ్లా నాయక్ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ వర్షన్ మార్చ్ 25న విడుదల కావాల్సి ఉంది. కారణం ఏదైనా భీమ్లా నాయక్ హిందీ వర్షన్ విడుదల చేయలేదు. ఇది ఒకింత పవన్ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. పాన్ ఇండియా రేంజ్ లో భీమ్లా నాయక్ వసూళ్లు కురిపిస్తుంది గట్టి నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ హిందీలో విడుదల చేయాలని కోరుకుంటున్నారు. బాలీవుడ్ లో పవన్ సత్తా చాటితే కాలర్ ఎగరేయాలని చూస్తున్నారు.
కొంచెం లేటైతే అయ్యింది కానీ.. భీమ్లా నాయక్ హిందీ వర్షన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్ (Bheemla Nayak Hindi Trailer)విడుదల చేశారు. తెలుగులో విడుదల చేసిన సెకండ్ ట్రైలర్ ని హిందీలో డబ్ చేసి విడుదల చేశారు. హిందీ వర్షన్ కి రానా స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. పవన్ కి మాత్రం వేరొకరు డబ్బింగ్ చెప్పారు. విడుదలైన భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్ వైరల్ గా మారింది.
ఇక బాలీవుడ్ లో ప్రభాస్, అల్లు అర్జున్ సత్తా చాటారు. ప్రభాస్ మూడు వరుస బ్లాక్ బస్టర్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. పుష్ప విజయంతో అల్లు అర్జున్ అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని సైతం పాన్ ఇండియా హీరోగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి పవన్ అభిమానుల కల ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి. భీమ్లా నాయక్ అక్కడ విజయం సాధిస్తే... పవన్ నయా రికార్డు నెలకొల్పినట్లే అవుతుంది. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ హిందీలో విడుదల చేసి పవన్ చేతులు కాల్చుకున్నారు. భీమ్లా నాయక్ పరిస్థితి ఏమిటో చూడాలి.
భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కి జంటగా నిత్యా మీనన్ నటించారు. థమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించారు.