`భీమ్లా నాయక్`తో హిట్ కొట్టాడు దర్శకుడు సాగర్ కె చంద్ర. ఇప్పుడు మరో సినిమాని ప్రకటించారు. బెల్లంకొండ హీరోతో సినిమా చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తో `భీమ్లా నాయక్` చిత్రాన్ని రూపొందించి హిట్ కొట్టాడు సాగర్ కే చంద్ర. అయితే ఈ మూవీకి త్రివిక్రమ్ పనిచేయడంతో క్రెడిట్ ఆయన ఖాతాలోకి వెళ్లింది. కొంత గ్యాప్ తో ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు సాగర్ కే చంద్ర. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు దర్శకుడు సాగర్ కే చంద్ర వర్కింగ్ స్టిల్స్ ని పంచుకున్నారు.
ఈ మూవీని 14 రీల్స్ పతాకంపై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. త్వరలోనే అప్ డేట్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. జనవరి 3న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్ డే. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉంది.
ఇక బెలంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ లేదు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా కెరీర్ ని లాక్కొస్తున్నాడు. వివి వినాయక్‌తో చేసిన `అల్లుడు శ్రీను`, బోయపాటితో చేసిన `జయజానకి నాయక` చిత్రాలు జస్ట్ ఓకే అనిపించాయి. `రాక్షసుడు` ఫర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. ఇటీవల హిందీలోకి ఎంట్రీ ఇచ్చి `ఛత్రపతి` రీమేక్ చేశాడు. అదే టైటిల్ పెట్టారు. అది ఘోర పరాజయం చెందింది.
మరోవైపు తెలుగులో `స్టూవర్ట్ పురం గజదొంగ` పేరుతో సినిమాని ప్రకటించారు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కించే చిత్రమిది. కానీ రవితేజ పాన్ ఇండియా రేంజ్‌లో ఆ మూవీ చేస్తున్న నేపథ్యంలో దాన్ని పక్కన పెట్టారు. దీంతో నెక్ట్స్ బెల్లంకొండ సినిమా ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కెరీర్ అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మరి ఇప్పుడైనా హిట్ కొడతాడా? అనేది చూడాలి.
