ఒక అదృష్టవంతుడు గురించి మరొక అదృష్టవంతురాలు రాయడం సమంజసం గానే ఉంటుంది. కానీ నాగేశ్వరరావు గారి గురించి నేనేం రాసినా నన్ను గురించి నేను రాసుకున్నట్లు ఉంటుంది. ఎందుకంటే వయస్సులోనూ, గుణంలోనూ, ఆశయాల్లోనూ, ఒక్క టెంపరమెంట్ విషయంలో తప్ప ,  ఉన్నమాట మొహం మీద అనేసి చీవాట్లు తినే వృషభ లగ్నం నాది. ఉన్నమాట డొంకతిరుగుడుగా అని మంచివాడు అనిపించుకునే వృశ్చిక లగ్నం నాగేశ్వర్రావుది. ఈ రెండు స్వభావాలు లగ్నాలవల్ల వచ్చాయని నేను అనను కానీ, వృశ్చిక లగ్నం వారైతే తేలు స్వభావం కలిగి ఉంటారన్న విషయం చాలా వరకూ వాడుకలో ఉన్నదే. కానీ నాగేశ్వరరావు గారు మంచి తేలు. ఎవరినీ కుట్టడు. ఒకవేళ కుట్టినా చురుకే కానీ విషం ఉండదు.

ఒకరికి అపకారం చేసే స్వభావం నాగేశ్వర్రావుకి లేదు కానీ ఎవరిమీదైనా పగ పట్టదలుచుకుంటే తన నామం సార్దకం చేసుకోగలిగే లోతు స్వభావం గలవాడే. అయినా అంతవరకూ పోడు. నిదానం మీద కార్యం సాధించగల సమర్దుడు. అందుకే అందరూ నాగేశ్వర్రావు నెమ్మదస్తుడు అంటారు. మరి పైకి అలా కనిపించను కానీ నేనూ నెమ్మదస్తురాలినే. కానీ నన్నెవరూ ఆవిడ చాలా నెమ్మిదస్తురాలు పైకి అలా కనిపిస్తుంది కానీ అని అనరేం. అక్కడే ఈ విషయంలోనే నా అదృష్టం చూపులో కాస్త మెల్ల ఏర్పడింది. ఈ ఒక్క విషయంలోనే నాగేశ్వరరావుగారితో పాటు మరొకడ అదృష్టవంతుడు కూడా ఉన్నాడు. ఆయనే మావారు.

మావారికి కూడా ప్రపంచం అనవసరంగా మంచివాడినే బిరుదిచ్చి కూచుంది. అందరూ మావాని మంచివారనటమే కాకుండా ఆహ్...ఆయన దేవుడు లాంటి మనిషండి అనటం కూడా విన్నాను. మరి నన్ను కూడా ఆహా మనిషిలాంటి దేవతండీ మీరు అనరేం. అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శని అన్నట్లు , దూర్వాస మహాముని కూడా పెద్ద మహర్షీ, తపస్సంపర్నుడే, ఏం ప్రయోజనం, చచ్చే కోపంతో కనపడ్డవాళ్లకల్లా శాపం ఇచ్చి  నానా రాద్దాంతం చేస్తూ ఉంటుంటే మహాబుషి అన్న భక్తి కంటే శాపం ఇస్తాడనే భయంతోనే హడిలి ఛస్తారాయె. మరి వశిష్టుల వారో, కేవలం శాంతి మూర్తి, మంచివాడు అంటారు. ముహూర్తం పెట్టాడు. రామ పట్టాభిషేకానికి, పాపం రాముడు అన్యాయంగా అడవుల పట్టుకుపోయాడు ఆ ముహూర్త బలానికి తట్టుకోలేక అదేంటయ్యా అంటే రాముడు అడవులు పట్టుకుపోతాడని వశిష్టులవారికి ముందుగా తెలిసే అలాంటి ముహూర్తం పెట్టాడు పొమ్మన్నారు ఆనాటి పెద్దలు.

అవును కామోసు అనుకున్నారు పిన్నలు. అదే ముహూర్తం ఈ రోజు ఏ పురోహితుడైనా పెట్టి ఉంటే అతని పిలక లాగి కొంపగోడుతో సహా ద్వీపాంతరవాసానికి పంపేసేవారీ నాటి ప్రజలు. అందరూ సమర్దించారు కాబట్టి ఆనాడు వశిష్టుడు బ్రతికిపోయాడు. మరి అలాగే దుర్వాసుణ్ణి సమర్దించరే..ముక్కోపి కనుక ఎవరు సమర్దించలేదు అనుకోవాలి. కాబట్టి ప్రపంచంలో ఎవరైతే నెమ్మిది స్వభావం కలిగి ఉంటారో వాళ్లు నిజంగా అదృష్టవంతులే. అలాంటి వారిని ప్రపంచం ఎప్పుడూ సమర్దిస్తుంది. అలాగని నన్ను దుర్వాసుడితోనూ, నాగేశ్వర్రావుని వశిష్టుడుతోనూ నేను  పోల్చడం లేదు. కానీ స్వభావం విషయంలో నాకన్నా నాగేశ్వర్రావు అదృష్టవంతుడంటున్నాను అని నాగేశ్వర్రావుగారు గురించి భానుమితి ఆనాటి పత్రిక కినిమాలో  రాసుకొచ్చారు.