`భైరవద్వీపం` రీ రిలీజ్.. బాలయ్య ఫ్యాంటసీ వచ్చేది అప్పుడే..
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్‌లు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియెన్స్. అందులో భాగంగా ఇప్పుడు బాలయ్య నటించిన మరో మూవీ రిలీజ్ కాబోతుంది.

బాలయ్య నటించిన ఫాంటసీ మూవీ `భైరవద్వీపం`.. ఫాంటసీ మూవీస్‌లో ఓ ల్యాండ్ మార్క్ లాంటి చిత్రంగా నిలిచింది. ఇందులో మైథాలిజికల్ ఎలిమెంట్లకి ఫాంటసీని జోడించి తెరకెక్కించారు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. బాలకృష్ణ, రోజా, రంభ నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి ఆదరణ పొందింది. కానీ ఫాంటసీ మూవీస్‌లో మంచి ప్రయత్నంగా నిలిచింది.
సినిమా రిలీజ్ అయి దాదాపు 29ఏళ్లు పూర్తి చేసుకుంది. ముప్పై ఏళ్లకి చేరువలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్ సాగుతున్న విషయం తెలిసిందే. `ఈ నగరానికి ఏమైంది` అనే సినిమాకి రిలీజ్ టైమ్ లో కంటే రీ రిలీజ్ టైమ్‌లోనే ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు `భైరవద్వీపం` మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు.
ఆగస్ట్ 5న 4కే రిజల్యూషన్‌తో ఈ మూవీని విడుదల చేస్తుండటం విశేషం. క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్స్ పతాకంపై పీవీ గిరి రాజు, పి దేవ్ వర్మ ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ముప్పై ఏళ్ల నాటి మ్యాజిక్‌ని రిపీట్ చేయాలని భావిస్తున్నారు. మరి ఈ మూవీ థియేటర్లలో ఏమేరకు ఆదరణ పొందుతుందో చూడాలి. ఇప్పటికే బాలయ్య నటించిన పలు సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఏదీ చెప్పుకునే విధంగా ఆడలేదు. మరి ఈ సినిమా పరిస్థితేంటనేది చూడాలి.
ఇ ప్రస్తుతం బాలకృష్ణ `భగవంత్ కేసరి` చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కాజల్ కథానాయికగా నటిస్తుంది. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల కాబోతుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుండటం విశేషం. ఇందులో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.